జాతిపిత, మహాత్మా గాంధీని అమెరికా ప్రతిష్ఠాత్మక 'కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్'తో గౌరవించుకోవాలని మరోసారి ప్రతినిధుల సభ తీర్మానించింది. ఈ ప్రతిపాదనను న్యూయార్క్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సభ ముందుకు తీసుకొచ్చారు. శాంతి, అహింస మార్గాల్లో మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ బీ మెలోని కోరారు.
"మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన నడిచిన అహింస మార్గాలు దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి ఆయనో ఉదాహరణ" అని కరోలిన్ పేర్కొన్నారు.
గాంధీ మార్గం.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా చేపట్టిన వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని మెలోని తెలిపారు. ఓ ప్రజాప్రతినిధిగా గాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్.. అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం. అయితే.. మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి గాంధీ కానున్నారు.
ఇదీ చదవండి:'కొత్త చట్టంతో గాంధీ విలువలకు పట్టం'