అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రమాణ కార్యక్రమం జరగనున్న వాషింగ్టన్ ప్రాంతం మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది. క్యాపిటల్ భవనంపై ఇటీవల ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం, ఇతర కార్యాలయాల చుట్టూ ఎనిమిది అడుగుల పొడవైన బ్యారికేడ్లను ఏర్పాట్లు చేశారు.
సిద్ధంగా ఉన్నాం..
స్థానిక పోలీసులతో సహా ఇప్పటికే 25,000 మందితో కూడిన నేషనల్ గార్డ్ దళాలు పహారా కాస్తున్నాయి. అమెరికాలో పౌరయుద్ధం జరిగిన సమయంలో అధ్యక్షుడిగా లింకన్ ప్రమాణానికి ఏర్పాటుకు చేసిన విధంగా ఈసారి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని 'ది హిల్' పత్రిక కథనం ప్రచురించింది. అంతేకాకుండా.. 4,000కు పైగా అమెరికా మార్షల్స్ అధికారులు.. వాషింగ్టన్లో మోహరించారు. బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని అమెరికా అత్యన్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వాషింగ్టన్ సీక్రెట్ సర్వీస్ స్పెషలస్ ఏజెంట్ ఇన్ఛార్జ్ మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో ఈ తరహా భద్రతా ఎప్పుడూ జరగలేదని తెలిపారు. దేశమంతా వాషింగ్టన్లో జరగుతున్న భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తోందని వాషింగ్టన్ మేయర్ మ్యూరియెలస్ బౌసర్ అన్నారు.
నిరసనకారులు..
అనేక చోట్ల నిరసనకారులు కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. రెండు డజన్లకు పైగా మంది.. ఆయుధాలతో, ఓహియో స్టేట్హౌజ్ బయట కనిపించడం కలకలం సృష్టించింది. సౌత్ కరోలినా స్టేట్హౌజ్ ముందు మరికొంత మంది అమెరికా జెండాలను ప్రదర్శించారు.
వివిధ రాష్ట్రాల్లోని స్టేట్హౌజ్లపై నిరసనకారులు దాడులకు దిగే ప్రమాదం పొంచి ఉన్నందున పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అనేక రాష్ట్రాల గవర్నర్లు తెలిపారు. శాంతియుత నిరసనకారుల హక్కులను తాము గౌరవిస్తామని ఓహియో రాష్ట్ర గవర్నర్ మైక్ డీ వైన్ ఆదివారం ప్రకటించారు. అదే సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతర్గత దాడులు జరిగే ప్రమాదం!
ఎంతటి పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అమెరికా అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతూనే ఉన్నాయి. భద్రతా బలగాల్లోని వారు కూడా నిరసనలకు తావునిచ్చే చర్యలకు పాల్పడుతారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి:బైడెన్ ప్రమాణం ముందర.. మారణాయుధాల కలకలం