అగ్రరాజ్యం అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చైనాకు చెందిన 59 కంపెనీల ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ ఆ దేశ వాణిజ్య విభాగం నిర్ణయం తీసుకుంది. వీటిని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. కంప్యూటర్ విడిభాగాల్లో వినియోగించే సెమీకండక్టర్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా కంపెనీ అంతర్జాతీయ సెమీకండక్టర్ కార్పోరేషన్‌ను(ఎస్ఎంఐసీ) సైతం ఈ జాబితాలో చేర్చడం గమనార్హం.
జాతీయ భద్రత కోసమే..
అమెరికా జాతీయ భద్రతతో పాటు.. విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఎస్ వాణిజ్య విభాగం తెలిపింది. తమ అత్యాధునిక సాంకేతికతను అమెరికా విరోధులు వాడుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ తెలిపారు. సైనిక అవసరాలకు తగిన ఉత్పత్తులను ఎస్ఎంఐసీ విరివిగా ఉత్పత్తి చేస్తూ.. విచ్చలవిడిగా వినియోగిస్తూ పౌరుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని రాస్ అన్నారు. ఈ కంపెనీ దిగుమతులపై ఆంక్షలతో అమెరికా భద్రతా దళాలను అస్థిరపరచే కుట్రకు తెరదించినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వీటితో పాటు.. మానవ హక్కులకు భంగం కలిగించేలా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించే, నిరంతర నిఘాకు ఉపకరించే పరికరాల ఉత్పత్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
59 కంపెనీల ఉత్పత్తుల ఆంక్షలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. ఈ చర్యలతో దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలకు అడ్డుకట్టపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇండో పసిఫిక్‌లో శాంతి కోసం 'క్వాడ్' చర్చలు