అమెరికా పోలీసుల చేతిలో మృతిచెందిన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో అగ్రరాజ్యంలో నిరసనలు అంతకంతకూ హోరెత్తుతున్నాయి. ఆందోళనల్లో భాగంగా కొందరు నిరసనకారులు హింసాత్మక దాడులకు పాల్పడుతున్నందున ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు. గాంధీ విగ్రహంపై రంగులు చల్లినట్లు గుర్తించిన అక్కడి అధికారులు, విగ్రహాన్ని కవర్‌తో కప్పివేశారు. ఆ ఘటనపై అమెరికాలోని పార్క్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించిన అమెరికా.. గాంధీ విగ్రహానికి జరిగిన అవమానంపై క్షమాపణలు కోరింది.
నిరసనకారులు చేస్తున్న హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని అమెరికాలోని భారత రాయబారి కెన్ జస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
'నిరసనకారుల చేష్టలతో వాషింగ్టన్ డీసీలో ఉన్న గాంధీ విగ్రహానికి జరిగిన అవమానానికి చింతిస్తున్నాం. దీనిపై క్షమాపణలు కోరుతున్నాం. వివక్ష, పక్షపాతవైఖరికి వ్యతిరేకంగా మేము కట్టుబడి ఉన్నాం. తొందరలోనే వీటి నుంచి బయటపడతాం.'
- కెన్ జస్టర్ ట్విట్టర్, అమెరికాలోని భారత రాయబారి
ఆగని ఆందోళనలు..
జార్జ్ ఫ్లాయిడ్ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా నిరసన సెగలు, భారీ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. 'ఐ కాంట్ బ్రీత్' పేరుతో మొదలైన ఈ నిరసనలు ప్రభుత్వ ఆస్తులు తగులబెట్టడం, చాలా చోట్ల విధ్వంసానికి కారణమవుతున్నాయి. అమెరికాలో వివక్ష, జాత్యాహంకారానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శిస్తున్న నిరసనలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అణచివేసేందుకు అవసరమైతే సైన్యాన్నే రంగంలోకి దించుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: అమెరికాలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు