ఒసామా బిన్ లాడెన్.. ఈ పేరు వింటే ప్రపంచ దేశాలే గడగడలాడతాయి. అత్యంత శక్తిమంతమైన అమెరికా లాంటి దేశాల్లోనూ ఉగ్రవాద దాడులు చేసిన లాడెన్‌ను అగ్రరాజ్యం మట్టుబెట్టింది. ఇక ఉగ్రభూతంతో కష్టం లేదని ఊపిరి పీల్చుకున్నాయి ప్రపంచ దేశాలు. ప్రస్తుతం మరోసారి లాడెన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు కారణం..ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్.
తండ్రి హత్య అనంతరం అల్ ఖైదాకు హమ్జా నాయకుడయ్యాడని అమెరికా తెలిపింది. తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా అమెరికాపై దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశం భావిస్తోంది. అతడి సమాచారం అందిస్తే మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
హమ్జా బిన్ లాడెన్ ను అల్ ఖైదా వర్గాలు జిహాద్‌కు రాజకుమారుడిగా అభివర్ణిస్తున్నాయి. సిరియా అంతర్యుద్ధం పాలస్తీనా స్వేచ్ఛకు దారితీస్తుందని జిహాదీలు ఐక్యంగా ఉండాలని 2015 లో హమ్జా ఓ ఆడియో సందేశం విడుదల చేశాడు. ఆ తర్వాత సౌదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మరో సందేశంలో జిహాదీలను కోరాడు. హమ్జా ఎక్కడ ఆశ్రయం పొందాడన్నది ప్రశ్నగానే మిగిలింది.