2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణ ధాన్యాల ఏడాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. భారత్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సాధారణ సభలో 70 దేశాలు ఆమోదం తెలిపాయి. ఐక్యరాజ్యసమితి, వాటి సభ్యదేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్ధలు 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా పాటించాలని ఈ తీర్మానం కోరింది.
వాతావరణ మార్పులు, తృణధాన్యాలపై అత్యవసర అవగాహన పెంచడం సహా ఆయా ధాన్యాల ఉత్పత్తి, వినియోగం ద్వారా వైవిధ్య, సమతుల, ఆరోగ్యకర ఆహారాన్ని ప్రోత్సహించాలని ఈ తీర్మానం పేర్కొంది. తృణధాన్యాల పోషకాహార, పర్యావరణ ప్రయోజనాలను ప్రపంచానికి అందించే విషయంలో ఈ తీర్మాన ఆమోదం పెద్ద ముందడుగు అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి ఎస్ తిరుమూర్తి అన్నారు. సాధారణ సభలో ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.