చైనా.. తన దేశంలో ముస్లిం మైనారిటీలు సహా షింజియాంగ్, టిబెట్‌లోని స్వయం ప్రతిపత్తి ప్రాంతాల్లోని ప్రజలను అణచివేస్తోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రాథమిక స్వేచ్ఛను పరిరక్షించేందుకు సరైన నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై చైనా ప్రభుత్వంతో పలుసార్లు ప్రస్తావించినట్లు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ప్రతీకార చర్యలు..
షింజియాంగ్, టిబెట్ ప్రాంతాల అణచివేత సహా.. న్యాయవాదులను నిర్బంధించడం దేశ వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు భంగం వాటిల్లిందని యూఎన్ నిపుణులు ప్రకటించారు. కరోనా మహమ్మారికి సంబంధించి పాత్రికేయులు, వైద్య సిబ్బంది, ఆన్లైన్ వినియోగదారులపై ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించారు. ఫలితంగా తప్పుడు సమాచార వ్యాప్తితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు.
ఎన్ఎస్ఏ అమలైతే.?
హాంకాంగ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతం(ఎస్ఏఆర్)లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనల సందర్భంగా అక్కడి ప్రజలు అణచివేతకు గురయ్యారని యూఎన్ తెలిపింది. ఆ సమయంలో మహిళా ఆందోళనకారులపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసినట్లయితే.. హక్కులను చైనా ఉల్లంఘించినట్లవుతుందని హెచ్చరించారు ఐరాస నిపుణులు.
అయితే.. హాంకాంగ్, టిబెట్, షింజియాంగ్ వంటి స్వయంప్రతిపత్తి ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితిపై దృష్టి సారించేందుకు ఇదే సరైన సమయం అని ఐరాస నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: చైనా అధికారుల వీసాలపై అమెరికా ఆంక్షలు