Maharashtra Polls Priyanka Gandhi : మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం వల్లే మహారాష్ట్ర యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆమె ఆరోపించారు. మహారాష్ట్రలో 2.5 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించట్లేదని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో మహాయుతి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని దుయ్యబట్టారు.
మహారాష్ట్రలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మహాయుతి నాయకులు 'లడ్కీ బహిన్' వంటి పథకాలను తెరమీదకు తీసుకువస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. ఇకనైనా ప్రజలు వారి మాయ మాటలను నమ్మకుండా అభివృద్ధి గురించి ఆలోచించాలని, ముఖ్యంగా మహిళలు డబ్బు కోసం కాకుండా మెరుగైన జీవితం కోసం ఓటు వేయాలని ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) అధికారంలోకి వస్తే, సోయాబీన్ పంటకు క్వింటాల్‌కు రూ.7,000 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఐక్యంగా ఉంటే భద్రంగా ఉండొచ్చని బీజేపీ చేస్తున్న నినాదాలు పేద ప్రజల కోసం కాదని, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారి మిత్రులు ఐక్యంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారని ప్రియాంక అన్నారు. ఆ పార్టీ ఎవరి అభివృద్ధి గురించి కృషి చేస్తున్నారో దేశం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో రైతులు, కార్మికులు కాదు వ్యాపారవేత్తల పరిశ్రమలు భద్రంగా ఉన్నాయని అన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశంలోని పలు ప్రధాన కంపెనీలు అదానీ ఆధీనంలో ఉన్నాయని, ప్రభుత్వ విధానాలు ఒక వ్యక్తికి అనుకూలంగా ఉండేలా మోదీ మార్పులు చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. దేశానికి చెందిన ఆస్తులను ఒకరికి కేటాయించడానికి చూపించే నిబద్దత యువతకు ఉద్యోగాలు కల్పించడంపై కూడా ఉండాలని సూచించారు.
కాంగ్రెస్ హయాంలో రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండేవారని, కానీ ప్రస్తుత మోదీ సర్కార్ పాలనలో ఈ జవాబుదారీతనం ఏమాత్రం లేకుండా పోయిందని విమర్శించారు. ఎంవీఏ అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.