అమెజాన్ అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చుపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. విశిష్టమైన ఈ అడవుల రక్షణకు కృషి చేయాలని పిలిపునిచ్చింది. ఫ్రాన్స్ కూడా ఇదే రీతిలో స్పందించింది. అయితే బ్రెజిల్ (మితవాద) అధ్యక్షుడు బోల్సోనారో ... అమెజాన్ కార్చిచ్చు సమస్యపై ఫ్రాన్స్ 'వలసవాద మనస్తత్వం'తో ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఏడాది బ్రెజిల్లో 73 వేల సార్లు అడవులు తగలబడ్డాయి. ముఖ్యంగా అమెజాన్ అడవుల్లోనే ఎక్కువ సార్లు కార్చిచ్చులు చెలరేగాయి. 2013 నుంచి జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇదే అత్యధికం.
ఉక్కిరిబిక్కిరి చేస్తోంది..
అమెజాన్ కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు ఎంత ప్రాంతం నాశనమయ్యిందో కచ్చితంగా తెలియడంలేదు. అయితే అక్కడ నుంచి వెలువడుతున్న పొగ... 'సావోపాలో'తో సహా పలునగరాలకు వ్యాపించి, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఆందోళనగా ఉంది...
అమెజాన్ అడవుల్లో అంతకంతకూ పెరిగిపోతున్న కార్చిచ్చుపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రపంచ వాతావరణ సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో... జీవవైవిధ్యానికి, ఆక్సిజన్‌కు ప్రధాన వనరుగా ఉన్న అమెజాన్ అడవులను కోల్పోలేము. అమెజాన్ అరణ్యాలను కచ్చితంగా రక్షించుకోవాలి."
- ఆంటోనియో గుటెరస్
ఇది... అంతర్జాతీయ సంక్షోభం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అమెజాన్ కార్చిచ్చును 'అంతర్జాతీయ సంక్షోభం'గా ఆభివర్ణించారు. ఈ వారాంతంలో జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ సమస్య పరిష్కారానికి... ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలన్నీ ముందుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
"మన ఇల్లు మంటల్లో కాలిపోతోంది. మన గ్రహానికి ఊపిరితిత్తుల వంటి అమెజాన్... 20 శాతం వరకు ఆక్సిజన్‌ను అందిస్తోంది. అది ప్రస్తుతం నాశనమైపోతోంది. దాన్ని మనం రక్షించుకోవాలి."
- ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
అప్రమత్తంగా ఉన్నాం..
బ్రెజిల్, బొలీవియాకు పక్కదేశమైన పెరు... అమెజాన్ కార్చిచ్చు విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది. మరోవైపు పరాగ్వేలో ఇప్పటికే చాలా అటవీ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది.
మా ప్రయోజనాలు దెబ్బకొట్టేందుకు కుట్ర
బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో... ఫ్రాన్స్, ఎన్జీవోలు, పర్యావరణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా కలిసి అమెజాన్ కార్చిచ్చును అడ్డుపెట్టుకుని.. బ్రెజిల్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు.
"నేను పర్యావరణాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు. నేను బ్రెజిల్‌ను రక్షించుకోవాలని అనుకుంటున్నాను."
- బోల్సోనారో, బ్రెజిల్ అధ్యక్షుడు