మయన్మార్లో రోజురోజుకు పెరిగిపోతున్న హింస పట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారుల హత్యలు, సైన్యం ఏకపక్ష అరెస్టులను ఖండించారు. నిర్బంధంలో ఉన్నవారిని హింసించడం ప్రాథమిక మానవ హక్కులకు వ్యతిరేకమని అన్నారు. నిగ్రహం పాటించాలంటూ ఐరాస భద్రతా మండలి చేస్తున్న ప్రకటనలకు.. మయన్మార్ సైనిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు.
మయన్మార్లో సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పనిచేయాలని గుటెరస్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సహా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చొరవ తీసుకునేందుకు ఐరాస ప్రత్యేక రాయబారిని మయన్మార్ సందర్శనకు అనుమతించాలని సైనిక ప్రభుత్వాన్ని కోరారు.
138 మంది బలి
ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసిన మయన్మార్ సైన్యం.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రభుత్వ నేతలను నిర్బంధించింది. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటివరకు సైన్యం హింసాకాండలో కనీసం 138 మంది మరణించినట్లు ఐరాస తెలిపింది.
ఇదీ చదవండి: జో బైడెన్ సర్కార్కు 'కిమ్' తొలి హెచ్చరిక