Ukraine Crisis: ఉక్రెయిన్ -రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా మధ్య గొడవ పెట్టే యోచన చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్-22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయాలన్నారు. ఆ దాడిని చైనా చేసినట్టు అమెరికా చెబితే.. రష్యా, చైనా మధ్య గొడవ ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పుడు ఎంచక్కా కూర్చొని చూడవచ్చంటూ హాస్యమాడారు. శనివారం జరిగిన రిపబ్లికన్ జాతీయ కమిటీ అగ్ర నేతల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అది విని సభలోని వారంతా నవ్వుకున్నారు.
ఉక్రెయిన్ ఆయుధాలు వీడే వరకు..
Russia Invasion: ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన సైనిక చర్య పదిరోజులైనా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల దాడుల్లో వేల మంది సైనికులతోపాటు సామాన్యులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు చర్చలు జరుపుతూనే రష్యా సైన్యం ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ కాల్పుల విరమణ పాటించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోవాన్ చేసిన విజ్ఞప్తికి రష్యా అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. కీవ్ పోరాటాన్ని నిలిపివేసే వరకూ రష్యా సైన్యం వెనక్కితగ్గే ప్రసక్తే లేదని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ మరోసారి చర్చలు జరిపారు. సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్‌తో మేక్రాన్ చర్చించడం ఇది నాలుగోసారి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండు దేశాల సైన్యం కాల్పులు విరమణకు అంగీకరించినప్పటికీ అమల్లో మాత్రం కనిపించడం లేదు. 'హ్యుమానిటేరియన్ కారిడార్'కు రెండోరోజూ ఆటంకం ఏర్పడింది. మేరియుపొల్, వోల్నవాఖ నగరాల్లో కాల్పుల విరామం ఉంటుందని ప్రకటించిన రష్యా.. మళ్లీ దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తరలింపు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మేరియుపొల్ అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు శనివారం రోజు కూడా కొద్దిసేపు విరామం ప్రకటించినప్పటికీ రష్యా సేనలు మళ్లీ దాడులు మొదలుపెట్టడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు విదేశీయుల సురక్షిత తరలింపు సహా అన్ని అంశాలపై మూడో విడత చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ పేర్కొంది. దీంతో సోమవారం మూడో విడత చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: అణుబాంబు తయారీకి ఉక్రెయిన్ ప్లాన్- అందుకే రష్యా దాడి?