కరోనా మహమ్మారి అంతం, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ మార్పులు.. ఇలా పలు రకాల సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తే.. టర్కీ, పాకిస్థాన్ మాత్రం ఇంకా కాలం చెల్లిన డిమాండ్లతో కాలం వెల్లదీస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్, అఫ్గాన్ సంక్షోభం తర్వాత ప్రపంచ సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం వంటి గంభీరమైన అంశాల మధ్య ఐరాస సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, గత ఏడాది వర్చువల్ సమావేశాల్లోనూ ఇదే వైఖరిని అవలంభించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు భారత్ అప్పుడే చురకలంటించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని గట్టిగానే హెచ్చరించింది. అయినా, ఎర్డోగన్ బుద్ధి మాత్రం మారలేదు.
74 ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటూ ఎర్డోగన్ (erdogan kashmir unga) మంగళవారం నాటి తన ప్రసంగంలో పేర్కొన్నారు. చర్చల ద్వారా, ఐరాస నిబంధనలకు అనుగుణంగా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చాలంటూ తన నీతివాక్యాలు పలికారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న విషయంపై అవగాహన లేకుండా మాట్లాడారు.
ఎర్డోగన్ భారత్‌పై లేనిపోని విమర్శలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో (unga kashmir) కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి విమర్శలపాలయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా అర్థంలేని ఆరోపణలు చేశారు. ఇలా పలుసార్లు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి : టీకా ధ్రువపత్రాలను పరస్పరం గుర్తించుకోవాలి: మోదీ