అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తప్పించాలనే అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపినప్పటికీ దీనిపై విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే రోజు జనవరి 20 మధ్యాహ్నం 1గంటలకు ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలయ్యే అవకాశం ఉందని అమెరికా వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అభిశంసన తీర్మానాన్ని స్పీకర్ పెలోసి వీలైనంత త్వరగా సెనేట్‌కు పంపితేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొంది.
గత బుధవారం క్యాపిటల్ భవనంలో చెలరేగిన హింసకు ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఆయనపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించారు. దీనిని సెనేట్‌కు ఎప్పుడు పంపుతారనే విషయంపై స్పీకర్ నాన్సీ పెలోసి స్పష్టత ఇవ్వలేదు. అయితే కొందరు డెమోక్రాట్లు బైడెన్ ప్రమాణస్వీకారం చేసే వరకు ఆగి, ఆయన ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయడం మొదలు పెట్టాక ఈ ప్రక్రియ ప్రారంభించాలని పెలోసికి సూచించినట్లు తెలుస్తోంది.
సెనేట్ సమావేశం జరిగే రోజు తొలి అర్ధభాగం అభిశంసనపై చర్చించి, మిగిలిన సమయం సభ్యుల నామినేషన్ ధ్రువీకరించడానికి కేటాయించాలని కాంగ్రెస్‌కు బైడెన్ ఇప్పటికే సూచించారు.
విచారణకు నేతృత్వం ఎవరు?
అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిపై అభిశంసన విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించాలి. జనవరి 20కి ముందే ట్రంప్ అభిశంసనపై విచారణ ప్రారంభమైతే సీజే జాన్ రాబర్ట్స్ సారథ్యంలోనే విచారణ జరగుతుంది. కానీ జనవరి 20 తర్వాత ట్రంప్ పదవిని వీడాక విచారణ మొదలైతే ఎవరు నేతృత్వం వహిస్తారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే కమలా హ్యారిస్‌కు ఆ అవకాశం దక్కుతుందా? లేక సీజే రాబర్ల్ట్నే ఎంచుకుంటారో వేచి చూడాలి. ఒకవేళ డెమొక్రాట్లు సెనేట్ను నియంత్రిస్తే ప్రెసిడెంట్ ప్రోటెమ్ కూడా ట్రంప్ అభిశంసనపై విచారణకు నేతృత్వం వహించే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: 'బైడెన్' ప్రమాణ స్వీకారంలో లేడీ గాగా, జెన్నీఫర్ సందడి