పోలీసు కర్కశత్వానికి ఆఫ్రో- అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ బలైన తర్వాత అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో అగ్రరాజ్యం అట్టుడికిపోయింది. నగరాలన్నీ నిరసనలతో హోరెత్తిపోయాయి. కరోనాను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన బాట పట్టారు.
ఈ నేపథ్యంలో అమెరికాలో జరుగుతున్న నిరసనలు అసాధారణమైనవని పేర్కొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సీమా సిరోహీ. అమెరికాలో గతంలో జరిగిన జాతి వివక్ష ఉదంతాలు, వాటికి సంబంధించి పోలీసులపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా.. జార్జి ఫ్లాయిడ్ మృతికి సంబంధించినంత వరకు పోలీసులు వ్యవహరించిన తీరు వీడియోలో నిక్షిప్తమైందని పేర్కొన్నారు. గత 12 రోజులుగా నిరంతరాయంగా నిరసనలు జరగడం గమనార్హమన్నారు.
"అయితే ప్రస్తుతం నిరసనకారులు కొన్ని నిజమైన మార్పులు కోరుకుంటున్నారు. పోలీసులకు నిధులు నిలిపివేయాలని, పోలీసు వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు బిల్లును సైతం ప్రతిపాదించారు. కానీ నిరసనకారులు మాత్రం ఇప్పటికీ వెనకడుగు వేయడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాలకు ఈ నిరసన సెగలు వ్యాపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సహా ఆందోళనలకు ఆజ్యం పోసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది."
--- సీమా సిరోహీ, సీనియర్ జర్నలిస్ట్
పోలీసు విభాగాధిపతులతో పాటు, రక్షణ శాఖ మాజీ సెక్రెటరీలు ట్రంప్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయాన్ని సిరోహీ ప్రస్తావించారు. నిరసనలను అణచివేయడానికి ఆర్మీని దించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు.
శాంతి భద్రతలే ఆయుధం!
అయితే నవంబర్‌లో జరిగే ఎన్నికల నాటికి పరిస్థితులను తనవైపు తిప్పుకునే అవకాశం డొనాల్డ్ ట్రంప్‌కు ఉందని సిరోహీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిస్థితులను తారుమారు చేసేందుకు శాంతిభద్రత అంశాన్నే ప్రధాన అస్త్రంగా ట్రంప్ మలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మాదిరిగానే ఈ శాంతి భద్రతల అంశం ట్రంప్‌కు అనుకూలించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే ట్రంప్ శాంతి భద్రతల అధ్యక్షుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్నారని పేర్కొన్నారు సిరోహీ. 1968లో రిచర్డ్ నిక్సన్ సైతం ఇదే వ్యూహాన్ని అనుసరించారని... నల్లజాతీయులే కాకుండా అమెరికాలోని చాలా మంది ప్రజలు పోలీసు వ్యవస్థను రద్దు చేయడానికి వ్యతిరేకంగానే ఉండటం వల్ల అప్పట్లో రిజర్డ్ విజయం సాధించారని సిరోహీ వివరించారు.
పోలీసు వ్యవస్థను రద్దు చేయడానికి బదులు మరింత మెరుగ్గా పని చేయాలని అప్పటి ప్రజలు కోరుకున్నారన్నారు సిరోహీ. ప్రస్తుతం వామపక్షవాదులు చేస్తున్న ఈ డిమాండ్ అసంబద్దమైనదని పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పడు పోలీసు వ్యవస్థ ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు.
జార్జి మృతితో ప్రారంభం
మే 25న మిన్నియాపోలిస్‌లోని ఓ దుకాణం బయట ఫ్లాయిడ్ ను అరెస్టు చేశారు పోలీసులు. విచక్షణా రహితంగా అతని మెడపై మోకాలిని అదిమిపెట్టి ప్రాణాలు తీశారు. ఊపిరి తీసుకోలేకపోతున్నానంటూ దాదాపు 9 నిమిషాల పాటు విలవిల్లాడినా అతని గోడు వినిపించుకోలేదు.
ఈ ఘటన అనంతరం అమెరికాతో పాటు యూకే, ఫ్రాన్స్ దేశాల్లోనూ ఆందోళనలు పెల్లుబికాయి. బానిసల కాలం నుంచి మొదలైన వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' పేరిట భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.