అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కొవిడ్ బారిన పడటం.. వైరస్‌ను తీవ్రంగా పరిగణించాలనేందుకు సూచన అని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అన్నారు. మిషిగాన్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన బైడెన్.. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
"కొవిడ్ పాజిటివ్‌గా తేలిన అధ్యక్షుడు, ప్రథమ మహిళ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని నేను, నా భార్య జిల్ కోరుకుంటున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు. వైరస్‌ను తీవ్రంగా పరిగణించాలని చెప్పేందుకు మనందరికీ ఇదొక గట్టి సూచన. ఇది దానికదే వెళ్లిపోదు. బాధ్యతగా మనవంతు కృషి చేయాలి."
-జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు బైడెన్. మాస్కులు ధరించి, సురక్షిత దూరం పాటించాలని కోరారు. తరచుగా చేతులు కడుక్కోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కు ధరించడమే చాలా ముఖ్యమని అన్నారు. వేల మంది ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మాస్కు ప్రధాన సాధనమని అన్నారు.
"నిపుణుల మాటలు వినండి. మాస్కులు ధరించండి, చేతులు కడుక్కోండి, వ్యక్తిగత దూరం పాటించండి. సీడీసీ చెప్పినట్టు.. మనం మాస్కులు ధరిస్తే వచ్చే 100 రోజుల్లో లక్ష ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి దేశభక్తితో ఉండండి. మీకోసమే కాదు, మీ అమ్మ, నాన్న, మీ కుటుంబ సభ్యులు, మీరు ప్రేమించే వారిని కాపాడేందుకు మాస్కు ధరించండి."
-జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి
ప్రతీ ఒక్కరూ తరచుగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాజిటివ్‌గా తేలిన వారందరూ కాంటాక్ట్ ట్రేసింగ్‌లో పాల్గొనాలని సూచించారు. ఈ విధంగా ఏ వైరస్‌నైనా అడ్డుకోవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి- దక్షిణాఫ్రికా వారసత్వ ప్రదేశంగా.. గాంధీ నడయాడిన ఫీనిక్స్!