అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన విషయంలో శ్వేతసౌధం మరో కీలక విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ విచారణకు తన మాజీ న్యాయ సలహాదారు హాజరును ట్రంప్ అడ్డుకోవటాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని వాషింగ్టన్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది.
శ్వేతసౌధ న్యాయసలహాదారు డాన్ మెక్గాన్ను విచారణకు పంపే విషయంలో ట్రంప్ అభీష్టాన్ని తాము నిర్ణయించలేమని కోర్టు అభిప్రాయపడింది.
రష్యా జోక్యం కేసులో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా రాజకీయ జోక్యానికి సంబంధించి ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి అభిశంసన విచారణలో భాగంగా మెక్‌గాన్ హాజరవ్వాలని గతేడాది కాంగ్రెస్ ఆదేశించింది. అయితే ట్రంప్ ఆదేశాల మేరకు మెక్‌గాన్ హాజరయ్యేందుకు నిరాకరించారు. ఇది ట్రంప్ విచక్షణాధికారమని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
అరుదైన కేసు..
ఈ కేసు అమెరికా న్యాయపరిధిలో రాజ్యాంగ చిక్కులను తెచ్చింది. ప్రభుత్వంలోని ప్రధానమైన రెండు శాఖలైన శాసన, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికార అంతరాలను ఎత్తిచూపింది.
అయితే ఈ విషయాన్ని వాషింగ్టన్ ఫెడరల్ జిల్లా కోర్టులో కాంగ్రెస్ న్యాయ కమిటీ సవాలు చేసింది. అధ్యక్షుడి విచక్షణాధికారాలు తమకు అనుకూలంగా ఉండాలని కోరింది. రాజ్యాంగ సమస్యలపై నిర్ణయం తీసుకునే అమెరికా సుప్రీం కోర్టు.. ఇటువంటి అంశాలపై ఎప్పుడూ తీర్పునివ్వలేదు. ఫలితంగా న్యాయ కమిటీలోని మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు దిగువ కోర్టు ఈ తీర్పును ఇచ్చిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'అమెరికా- భారత్ మైత్రికి ట్రంప్ పర్యటన నిదర్శనం'