దక్షిణ కొరియా చిత్రం 'పారాసైట్'కు ఆస్కార్ అవార్డు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్యం విషయంలో అమెరికాతో ఎన్నో విభేదాలు ఉన్న దక్షిణ కొరియాకు చెందిన సినిమాకు అవార్డును ఎలా ఇస్తారని జ్యూరీని ప్రశ్నించారు ట్రంప్.
అవార్డు ఎంపిక విషయంలో ఘోర తప్పిదం జరిగిందన్నారు ట్రంప్. కొలరాడోలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"దక్షిణ కొరియాకు చెందిన 'పారాసైట్' సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది. ఆ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు. అమెరికాతో వాణిజ్య విభేదాలున్న దేశాల్లో దక్షిణ కొరియా తొలిస్థానంలో ఉంది. అలాంటి దేశానికి చెందిన సినిమాకు హాలీవుడ్లో అత్యుత్తమ బహుమతిని ఎలా ఇస్తారు?"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
జాతీయవాద నినాదంతో మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించారు ట్రంప్. రెండోదఫా ఎన్నికల్లోనూ 'అమెరికా ఫస్ట్' అనే నినాదాన్నే ఎంచుకున్నారు.
'బ్రాడ్‌పిట్' పైనా...
హాలీవుడ్‌ను క్లాసిక్ స్వర్ణయుగంలోకి తీసుకురావడానికి ఇదే మంచి సమయమని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో తన అభిశంసన తీర్మానానికి మద్దతు పలికిన బ్రాడ్పిట్పై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న పిట్‌ను తెలివి తక్కువవాడిగా అభివర్ణించారు అగ్రరాజ్య అధ్యక్షుడు.
ఇదీ చదవండి: మాటల్లో తెంపరి, చేతల్లో ట్రంపరి.. ఆయన రూటే సెపరేటు