కరోనా వైరస్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడం 'గౌరవ సూచిక' అని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ . తమ ప్రభుత్వం అత్యంత ఎక్కువ సంఖ్యలో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోందని... అందుకే 15 లక్షల కరోనా పాజిటివ్ కేసులను గుర్తించగలిగామని ఆయన వివరించారు.
కరోనా విజృంభణ తరువాత శ్వేతసౌధంలో నిర్వహించిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
" అమెరికా... ఇతర దేశాలతో పోల్చితే అత్యధిక సంఖ్యలో కొవిడ్-19 పరీక్షలు నిర్వహించింది. అందుకే మన వద్ద పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది ఓ మంచి విషయం. నిజంగా ఇది ఓ గొప్ప గౌరవ సూచకం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ అయిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం... ఇప్పటి వరకు అమెరికా 12.6 మిలియన్ కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన 3 లక్షల 25 వేలకు పైగా మరణించగా... అందులో 91 వేల మంది అమెరికన్లే కావడం గమనార్హం.
ప్రయాణాలపై నిషేధం!
కరోనా మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో లాటిన్ అమెరికా, బ్రెజిల్ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఇది వైఫల్యానికి చిహ్నం
ట్రంప్ వ్యాఖ్యలపై డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ మండిపడింది. అమెరికాలో 15 లక్షల మంది కరోనా బారిన పడడం.. 'నాయకత్వ వైఫల్యాన్ని' సూచిస్తోందని విమర్శించింది.
ఇదీ చూడండి: 'క్లోరోక్విన్ ఓ రక్షణ రేఖ- శక్తిమంతమైన ఔషధం'