ఇరాన్‌తో శాంతి చర్చల గురించి ఆలోచించడం చాలా ముందుగా స్పందించినట్లు అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పడానికి జపాన్ ప్రధాని షింజో అబే చేస్తున్న కృషిని ట్రంప్ అభినందించారు. అయితే శాంతి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని, అమెరికా కూడా అంతేనని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్‌తో చర్చల ప్రసక్తే లేదు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తొలగించడానికి జపాన్ ప్రధాని షింజో అబే ఇరాన్లో పర్యటిస్తున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఓ జపాన్ నేత ఇరాన్లో పర్యటించడం ఇదే మొదటిసారి. అయితే అమెరికా విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పులేదని ఇరాన్ స్పష్టంచేసింది.
"అమెరికాపై మాకు నమ్మకం లేదు. అమెరికాతో మునుపటి చర్చల చేదు అనుభవాన్ని మరోసారి పునరావృతం చేయదలుచుకోలేదు." - అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ అధినేత
ఇదీ చూడండి: ఈఎస్ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త