కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ప్రచారానికి కొద్ది నెలలపాటు దూరమయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే శనివారం నుంచి ప్రచార సభలు నిర్వహించేందుకు సంకల్పించారు ట్రంప్. ఈ నేపథ్యంలో సభల నిర్వహణపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఉన్నవారు సభలకు హాజరైతే మహమ్మారి విజృంభణకు ఎక్కువ అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
కరోనా విజృంభణ తక్కువగా ఉన్న టల్సా, ఓక్లోహోమాల్లో ప్రచార సభలను ఏర్పాటు చేశారు ట్రంప్. 19వేలమంది కూర్చుకునేందుకు అవకాశం ఉన్న హాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో కంటే ఇలాంటి పరిస్థితుల్లోనే వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"ఇలాంటి సభల్లో వ్యక్తులు ఆరు అడుగుల దూరం ఉండటం కష్టం. సభకు హాజరయ్యేవారు స్థానికులే కాక బయటి నుంచి కూడా వస్తారు. ఈ సందర్భంలో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ."
-అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ)
ట్రంప్ సభలకు సాధారణంగా వేల సంఖ్యలో హాజరవుతారు. వారు పరిశీలన కోసం లైన్లలో నిల్చున్నప్పుడు ఒకరికి ఒకరు తాకే ప్రమాదం ఉంది. వృద్ధులు ఎక్కువగా ట్రంప్ ప్రచారానికి హాజరవుతుంటారు. ఈ కారణంగా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీరాభిమానులు ట్రంప్ సభలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా సభల నిర్వహణ అంత శ్రేయస్కరమేమి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చూడండి: ధైర్యం కూడగట్టుకొని ట్రంప్ 'ర్యాంప్ వాక్'!