అగ్రరాజ్యానికి తలవొంపులు తెచ్చేలా అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దాడికి బాధ్యత వహిస్తూ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'క్యాపిటల్'పై దాడికి ముందు ట్రంప్ పార్టీ చేసుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫలితంగా అధ్యక్షుడిపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది.
ఇదీ చదవండి: 'అమెరికా చరిత్రలోనే ట్రంప్ అసమర్థ అధ్యక్షుడు'
వీడియోలో ఏముందంటే.?
ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించేందుకు ముందు శ్వేతసౌధం బయట ఓ టెంట్‌లో కొందరు పార్టీ నిర్వహించారు. ఇందులో అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా, కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీని జూనియర్ ట్రంప్ లైవ్ స్ట్రీమ్ చేసినట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆందోళనకారులను దేశభక్తులుగా పేర్కొన్న జూనియర్ ట్రంప్.. వారంతా క్యాపిటల్ ముట్టడికి వెళ్తున్నట్లు చెప్పారు. ఇక జూనియర్ ట్రంప్ ప్రేయసి కూడా ఈ పార్టీలోనే ఉన్నారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'మైక్ పెన్స్ తన తెలివితో బైడెన్ ఎన్నిక ధ్రువీకరణ ప్రక్రియను తప్పకుండా ఆపగలరు. ఆ నమ్మకం నాకుంది' అని అనడం గమనార్హం. వీడియోలో వెనుకవైపు పాప్ పాటలు మోగుతుండగా.. కొందరు వాటికి డ్యాన్స్ చేస్తున్నారు.
వెల్లువెత్తుతున్న విమర్శలు..
అయితే.. ఇది ఈ నెల 6(బుధవారం) నాటి ట్రంప్ ప్రసంగానికి ముందు తీసిందా లేదా తర్వాత తీసిందా అన్నది ఇంకా తెలియరాలేదు. వీడియోలో ట్రంప్.. టీవీలో వస్తున్న 'క్యాపిటల్' ఆందోళనను వీక్షిస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోను పలువురు డెమొక్రాటిక్ మద్దతుదారులు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 'ఓవైపు యావత్ దేశం బాధలో, ఆందోళనలో ఉంటే వీరు మాత్రం నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్నారు' అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.
క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత కూడా ఆందోళనకారులను దేశభక్తులంటూ ఇవాంకా ట్వీట్ చేశారు. అయితే.. దీనిపై విమర్శలు రావడం వల్ల ఆ ట్వీట్‌ను తొలగించారామె.
ఇదీ చదవండి: 'క్యాపిటల్'పై దాడి చేసిన వారి ఉద్యోగాలపై వేటు!
ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం
గత బుధవారం కాబోయే అధ్యక్షుడు బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సంయుక్త సమావేశం నిర్వహించిన రోజు.. వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో ఓ పోలీస్ అధికారి సహా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఘటన జరిగిన మరుసటి రోజు ట్రంప్ స్పందిస్తూ.. దాడిని ఖండించారు. ఓటమిని అంగీకరిస్తూ అధికార మార్పిడికి సహకరిస్తానని చెప్పడం గమనార్హం. మరోవైపు దాడి నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై శాశ్వత నిషేధం పడింది.
ఇదీ చదవండి: ట్విట్టర్‌కు దీటుగా ట్రంప్ కొత్త యాప్!