ఇరాన్ నుంచి ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంలో పశ్చిమాసియాలో తన బలగాన్ని మరింతగా పెంచుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ ప్రాంతంలో మరిన్ని బలగాలను మోహరించనుంది. ఈ మేరకు అధికారులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.
'సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు సహా పశ్చిమాసియాలో భద్రతకు ఇరాన్ వల్ల పెను ముప్పు వాటిల్లుతోంది. మన భాగస్వామ్య దేశాలకు భరోసా కల్పించి, ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సహా ఆ ప్రాంత భద్రతా సామర్థ్యాలను పెంపొందించడానికి అదనపు భద్రతా దళాలను మోహరిస్తున్నాం. ఈ అదనపు బలగాలతో సౌదీ అరేబియాలో మొత్తం అమెరికా సైనికుల సంఖ్య దాదాపు 3 వేలకు చేరుతుంది.'
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అధునాతన వ్యవస్థలు
సౌదీలో భద్రత పెంపులో భాగంగా అధునాతన రాడార్, క్షిపణి పరిజ్ఞాన వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతంలో క్షిపణి దాడులు సహా ఇతర గగనతల దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే కొంత సైన్యం సౌదీకి చేరుకోగా కొన్ని వారాల్లో మిగిలిన బలగాలు తరలనున్నాయి.