వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై అణచివేతకు వ్యతిరేకంగా చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
కొద్ది పాటి వ్యతిరేకతతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదించింది. అనంతరం విదేశాంగ మంత్రి మైక్ పాంపియో లేకుండానే ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఝింగ్జియాంగ్ ప్రాంతంలో వీగర్లతో పాటు ఇతర మైనారిటీలపై సామూహిక నిఘా, నిర్బంధం అమలు చేసిన అధికారులకూ ఆంక్షలు వర్తిస్తాయని ఈ బిల్లు స్పష్టం చేసింది.
"వీగర్ మానవ హక్కుల విధాన చట్టం- 2020.. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినవారిని జవాబుదారీగా ఉంచుతుంది. అయితే చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం కార్యనిర్వహక అధికారవర్గాలకు ఆంక్షలను రద్దు చేసే అవకాశం ఉంది. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వీగర్లపై చైనా తీవ్ర అణచివేత ధోరణితో ప్రవర్తిస్తోంది. సుమారు 10 లక్షల మందిని అత్యంత కఠినమైన నిర్బంధంలో పెట్టింది. ఇందుకు సంబంధించి చైనాపై కఠిన చర్యలు తీసుకోవటం ఇదే తొలిసారి. అయితే ఈ నిర్ణయం.. ఇప్పటికే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.
చైనాపై ప్రభావం!
అమెరికా నిర్ణయంతో చైనాపై ఒత్తిడి మరింత పెరుగుతుందని కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఆంక్షలతో ఘింగ్జియాంగ్ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను అమలు చేసే చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులపై ప్రభావం చూపనుందని అభిప్రాయపడ్డారు.
చైనా సాగిస్తున్న అణచివేత చర్యలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉందని అమెరికా తీసుకొచ్చిన తాజా చట్టం నొక్కి చెబుతోంది. వీగర్లపై సామూహిక నిఘా, నిర్బంధం గురించి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేస్తోంది.
గొప్ప రోజు..
అమెరికా నిర్ణయంపై ట్రంప్‌నకు వీగర్ ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది న్యూరీ టర్కెల్ కృతజ్ఞతలు తెలిపారు. వీగర్ ముస్లింలు, అమెరికాకు ఇది గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు.
వీగర్ల అణచివేత..
విస్తారమైన వనరులున్న ఘింగ్జియాంగ్ ప్రాంతంలో వీగర్ల వేర్పాటు వాదాన్ని చైనా కఠినంగా వ్యవహరిస్తోంది. 2014 నుంచి వీగర్లను సామాజికంగానూ అణచివేయటానికి చైనాకు చెందిన హాన్ తెగలను ఈ రాష్ట్రానికి తరలిస్తోంది. అయితే వీగర్ల అణచివేతపై వస్తోన్న ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది.
ఝింగ్జియాంగ్లో మూలవాసులు వీగర్ ముస్లింలు. చాలా ఏళ్లుగా చైనా నుంచి స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. చైనా అణచివేతతో దశాబ్దాలుగా చైనా నుంచి వేల మంది వీగర్లు వలస వెళ్లి పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందారు.