అమెరికాలోని కాలిఫోర్నియా ఆర్టికల్ III జిల్లా కోర్టు ఫెడరల్ న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన షిరీన్ మాథ్యూస్‌ను నియమించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. నియామకం పూర్తయితే తొలి భారతీయ-అమెరికన్ మహిళా న్యాయమూర్తి ఆమే అవుతారని నేషనల్ ఆసియన్ పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ (నాపాబా) తెలిపింది.
ప్రస్తుతం ఆమె శాన్ డియాగోలోని దేశంలో ఐదవ అతిపెద్ద న్యాయ సంస్థ జోన్స్ డేలో భాగస్వామి విధులు నిర్వహిస్తున్నారు. సంస్థలో చేరడానికి ముందు, మాథ్యూస్ కాలిఫోర్నియాలోని దక్షిణ జిల్లాలో యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయానికి సంబంధించిన క్రిమినల్ విభాగంలో అసిస్టెంట్ యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా పనిచేశారు.
ప్రభుత్వ సేవలో ప్రవేశించే ముందు... శాన్ డియాగోలోని లాథమ్ వాట్కిన్స్, ఎల్‌ఎల్‌పిలలో మాథ్యూస్ అసోసియేట్‌గా వ్యవహరించారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
"షిరీన్ మాథ్యూస్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో అనుభవజ్ఞురాలైన న్యాయవాది. కాలిఫోర్నియాలోని దక్షిణ జిల్లా కోర్టులో విధులు నిర్వహించేందుకు ఆమె అర్హత సాధించారు. ఆమె సమర్థవంతమైన న్యాయవాది, తాను సమాజానికి సేవ చేయడానికి, న్యాయవాద వృత్తిలో వైవిద్యాన్ని ప్రోత్సహించడానికి అంకితమయ్యారు. గతంలో శాన్ డియాగో దక్షిణ ఆసియా బార్ అసోసియేషన్ చాప్టర్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు."
-డేనియల్ సకాగుచి, నాపాబా అధ్యక్షుడు.
మాథ్యూస్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, మాగ్నా కమ్ లాడ్ పట్టా, డ్యూక్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి లా డిగ్రీ, కమ్ లాడ్ పట్టాను పొందారు.
ఇదీ చూడండి : లైవ్ వీడియో: 15 మందిని బలిగొన్న భయానక పేలుడు