భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది శ్వేతసౌధం. అయితే.. ఇరు దేశాల మధ్య సయోధ్యకు మధ్యవర్తిత్వంపై ఎలాంటి ప్రణాళికలు లేవని నొక్కి చెప్పింది.
" భారత్, చైనా సరిహద్దు పరిస్థితులపై అధ్యక్షుడికి తెలుసు. తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఘర్షణల్లో 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత్ ప్రకటించింది. సైనికుల మరణానికి మేము సంతాపం తెలుపుతున్నాం. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వంపై ఎలాంటి ఆలోచన లేదు. జూన్ 2న అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భారత్-చైనా సరిహద్దు అంశంపై మాట్లాడారు నేతలు."
- కేలీ మెక్ఎనాన్, శ్వేతసౌధం అధికార ప్రతినిధి
జూన్ 15న (సోమవారం) రాత్రి తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయప్డడారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నా.. డ్రాగన్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!