కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు ఆ ఆఫర్‌ను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఇకపై కశ్మీర్‌కు సంబంధించిన మధ్యవర్తిత్వం అంశం ప్రస్తావనే ఉండబోదని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబారి హర్ష వర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు.
కశ్మీర్ అంశంపై ఏనాడూ అమెరికా మధ్యవర్తిత్వం వహించలేదని, సమస్యలను పరిష్కరించే దిశగా భారత్-పాకిస్థాన్‌ను ప్రోత్సహించడమే అగ్రరాజ్య విధానమని ష్రింగ్లా తెలిపారు.
"భారత్-పాక్ అంగీకరిస్తేనే కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఆఫర్‌ను భారత్ అంగీకరించకపోవడం వల్ల మధ్యవర్తిత్వం చేసే యోచనను ట్రంప్ ఉపసంహరించుకున్నారు."
- హర్ష వర్ధన్ ష్రింగ్లా, అమెరికాలోని భారత రాయబారి
ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం...
జులైలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. పాక్ ప్రధానితో సమావేశమైన అనంతరం.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇమ్రాన్ స్వాగతించారు. అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రకటనను భారత్ ఖండించింది. కానీ అప్పటికే భారత్‌లో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగింది. ప్రధాని జవాబు చెప్పాలని పార్లమెంట్లో విపక్షాలు నిరసనలు చేపట్టాయి.
ఇదీ చదవండి:- 'ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్‌కు పరిష్కారం రాదు'