అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ అధ్యక్ష ఎన్నికలు భద్రంగా, నిజాయతీగా జరిగాయని వెల్లడించిన ఓ ఎన్నికల ఉన్నతాధికారిపై వేటు పడింది. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్‌ఏ) డైరెక్టర్ క్రిస్టోఫర్ క్రెబ్స్‌ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ట్రంప్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియపై అసత్య వ్యాఖ్యలు చేసినందుకే ఆయనను తొలగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ట్రంప్‌కు పడాల్సిన ఓట్లన్నీ జో బైడెన్‌కు వెళ్లాయి..
‘2020 ఎన్నికల భద్రతపై క్రిస్ (క్రిస్టోఫర్) క్రెబ్స్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. అధ్యక్ష ఎన్నికల్లో చాలా అవకతవకలు, మోసాలు జరిగాయి. చనిపోయినవారి ఓట్లు పడ్డాయి. ఓటింగ్ మెషిన్లలో సమస్యలు తలెత్తాయి. దాని వల్ల ట్రంప్‌కు పడాల్సిన ఓట్లన్నీ జో బైడెన్‌కు వెళ్లాయి. చాలా చోట్ల ఓటింగ్ రోజుల తరబడి జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అందుకే తక్షణమే క్రిస్ క్రెబ్స్‌ను సీఐఎస్‌ఏ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తున్నా’ అని ట్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోలేదనేది ఒకటే భద్రమైన విషయమని, అది కూడా ట్రంప్ పాలనాయంత్రాంగం వల్లే సాధ్యమైందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.
ఓట్ల డిలీట్, తారుమారు జరగలేదు..
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల చేతిలో ఓటమి చవిచూసిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రక్రియపై తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలో.. నవంబరు 3 జరిగిన అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైనవి అంటూ క్రిస్ క్రెబ్స్ ఇటీవల ప్రకటన విడుదల చేశారు. ఓట్లను డిలీట్ చేయడం లేదా ఓట్ల తారుమారు వంటివేవీ జరగలేదని క్రెబ్స్ స్పష్టం చేశారు. దీంతో ఆయనపై ట్రంప్ వేటు వేశారు.
ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచినా ట్రంప్ ఇంకా తన ఓటమిని అంగీకరించకపోవడం గమనార్హం. అమెరికా సంప్రదాయం ప్రకారం.. ప్రధాన మీడయా సంస్థలు బైడెన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించాయి. దీంతో ప్రపంచదేశాల నేతలు కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయినా కూడా ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోలేదు సరికదా.. అధికారి మార్పిడికి కూడా సహకరించట్లేదు.
ఇదీ చూడండి:'మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తోన్నా'