భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్లీ డేవిడ్సన్ మోటారు సైకిళ్ల దిగుమతిలో భారత్ విధించిన 50శాతం పన్నును ట్రంప్ తప్పుపట్టారు.
వాహనాల దిగుమతిపై భారత్ తొలుత 100 శాతం సుంకం విధించేది. ఫిబ్రవరిలో ఆ మొత్తాన్ని 50 శాతానికి తగ్గించింది. అయితే అమెరికా వాహనాల దిగుమతిపై అసలు పన్ను విధించకూడదని ట్రంప్ తేల్చిచెప్పారు.
అమెరికాను ఒక పెద్ద బ్యాంకుగా అభివర్ణించిన ట్రంప్... అందులో నుంచి అందరూ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తానుండగా అమెరికాను ఎవరూ మోసం చేయలేరని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టం చేశారు.
"భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు మంచి మిత్రుడు. అమెరికా ఎగుమతి చేసే వాహనాలపై సుంకాలు ఉంటున్నాయి. కానీ భారత్ ఇక్కడికి పంపే వాటిపై పన్నులు ఉండట్లేదు. నేను మోదీతో మాట్లాడాను. 100 శాతం ఉన్న సుంకాన్ని వెంటనే 50 శాతానికి తగ్గించారు. కానీ దాన్ని కూడా అంగీకరించలేం."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని సంకేతాలిచ్చారు ట్రంప్. భారతదేశాన్ని పలుమార్లు 'పన్నుల రారాజు'గా అభివర్ణించారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై పెద్దస్థాయిలో భారత్ సుంకాలు విధిస్తోందని మండిపడ్డారు.
భారత్‌కు జీఎస్పీ హోదాను ఇటీవలే రద్దు చేసింది అమెరికా. భారతీయ మార్కెట్లో అగ్రరాజ్యానికి సమాన అవకాశాలు కల్పించడంలో భారత్ విఫలమైనందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్