అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ తీరును పరిశీలిస్తే- ఆ పదవిలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హులనే భావన వ్యక్తమవుతోంది. తాను చేసిన పనుల విషయంలో ఆయన బాధ పడుతున్నట్లయితే, వెంటనే పదవి నుంచి వైదొలుగుతారు. కాని, మొండిఘటంగా పేరున్న ఆయన పదవిలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి, అధ్యక్షుడి తీరుతో మున్నెన్నడు లేనివిధంగా ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. అధ్యక్ష కార్యాలయంలో కొనసాగేందుకు ట్రంప్ అర్హులు కారనే విషయం చెప్పడానికి అభిశంసన ప్రక్రియలే అవసరం లేదని, ఆయన రోజువారీ ప్రవర్తనే ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటుతోందన్న విమర్శలూ లేకపోలేదు.
రష్యా అండదండలున్న తిరుగుబాటుదారులతో పోరాడుతూ ఇబ్బందికర పరిస్థితుల్లో నలుగుతున్న ఉక్రెయిన్‌ను ట్రంప్ ఉపయోగించుకున్న తీరు వివాదాస్పదమైంది. తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన ప్రైవేటుగా ఎలాంటి చర్యలకు దిగుతారనే దిగ్భ్రాంతికరమైన విషయాల్ని అభిశంసన ప్రక్రియ తెలియజేస్తోంది. ఉక్రెయిన్‌కు అందించిన అత్యవసర సైనిక సహాయాన్ని అందుకోసం ఆయన ఎలా ఉపయోగించుకున్నారనేది అభిశంసన ప్రక్రియ ద్వారా స్పష్టమవుతోంది. జో బైడెన్, హంటర్‌లను ఇబ్బంది పెట్టేందుకు, వారిపై మోసపూరిత దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలనే షరతుకు, ఉక్రెయిన్‌కు 40 వేలకోట్ల డాలర్ల సాయం విడుదలకు లంకె పెట్టారు. వారిపై అవినీతి ముద్ర వేసేందుకు శతధా ప్రయత్నించారు. ఇందుకోసం రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైన్యాన్ని సమర్థించే అమెరికా దీర్ఘకాలిక విధానాన్ని సైతం ఆయన ఉపసంహరించుకోవడం గమనార్హం. ఉక్రెయిన్‌లో అధికారంలో ఉన్న అవినీతి పరులైన నేతలకు మద్దతు ఇచ్చారు. అమెరికా దౌత్య ప్రతినిధుల బాధ్యతల్ని తన ప్రైవేటు న్యాయవాది, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గియులియానికి అప్పగించారు. ఇందుకోసం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమెరికా రాయబారిని సైతం తప్పించారు. ఇవన్నీ అభిశంసన ప్రక్రియలో భాగంగా తొలిరోజు చేపట్టిన బహిరంగ విచారణలోనే బయటకొచ్చాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడ్మిర్ జెలెన్‌స్కీకి జులై 25న ట్రంప్ ఫోన్ చేశారు. అప్పుడు జో బైడెన్, హంటర్‌లను దెబ్బతీసే సమాచారం తవ్వితీయాలని ఒత్తిడి తెచ్చినట్లు గుర్తుతెలియని ఓ ప్రజావేగు చేసిన ఫిర్యాదుతో వ్యవహారం అభిశంసన ప్రక్రియకు దారితీసింది. బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆయన కుమారుడు హంటర్ ఒక ఉక్రెయిన్ కంపెనీ కోసం పనిచేశారు. ప్రజావేగు ఫిర్యాదు అనంతరం ట్రంప్ తన ప్రైవేటు ప్రయోజనాల్ని పరిరక్షించుకునేలా నడచుకుంటారనే ఆరోపణలకు బలం చేకూర్చే వివరాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. అమెరికా దౌత్యనీతికి సంబంధించిన మౌలిక సూత్రాలను, సిద్ధాంతాలను సైతం దెబ్బతీశారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తన చర్యల్ని సమర్థించుకోలేని పరిస్థితి నెలకొంది. తప్పులు బయటపడుతున్నా, తనదైన ధోరణిలో ఏ మాత్రం జంకూగొంకూ లేకుండా ట్రంప్ తాను అమాయకుడిననే వాదిస్తుండటం గమనార్హం.
అభిశంసన విచారణ రెండోరోజున, అమెరికా మాజీ రాయబారి మేరీ యొవనోవిచ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తనకు ఏ స్థాయిలో వేధింపులు ఎదురయ్యాయో వివరించారు. తప్పుడు ఆరోపణలతో బైడెన్‌పై దర్యాప్తు ప్రారంభించే విషయంలో రూడీ పన్నిన కుట్రలో పాలుపంచుకోకపోవడమే ఇందుకు కారణమని వాపోయారు. అధ్యక్షుడు చేసిన సంస్థాగతమైన నష్టానికి మేరీ ఇచ్చిన సాక్ష్యమే ప్రాతిపదికగా నిలిచింది. అంతేకాదు, సమర్థులైన, నిజాయతీగల దౌత్యవేత్తల్ని రక్షించే విషయంలో విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వైఫల్యమూ బయటపడింది. ఈ విషయంలో ట్రంప్ చేసిన ట్వీట్‌ను సైతం బెదిరింపు చర్యగానే పరిగణించారు. దాన్ని సాక్షుల్ని ప్రభావితం చేసే చర్యగా డెమోక్రటిక్ కమిటీ ఛైర్మన్ అభివర్ణించారు. అభిశంసనకు ఇది మరో నిర్దిష్ట అంశంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఏప్రిల్‌లో అతడితో ట్రంప్ జరిపిన తొలి సంభాషణల లిప్యంతరీకరణను శ్వేతసౌధం విడుదల చేసింది. ఇది ట్రంప్ సమస్యల్ని మరింతగా పెంచింది. 2016 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలను రష్యాకు బదులుగా ఉక్రెయిన్‌పై సంధించడమే ట్రంప్ ఉద్దేశం. దీనికితోడు, రష్యా ఆక్రమణలకు వ్యతిరేకంగా భౌగోళిక సమగ్రతను పరిరక్షించడంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచేందుకు ఆయన ఎన్నడూ ఉత్సాహం చూపలేదు. మొత్తంగా ట్రంప్ విషయంలో ఏం జరుగుతుందనేది ప్రజాస్వామిక ప్రపంచానికి అంత్యంత ఆసక్తికరమైన విషయంగా మారింది.
ట్రంప్... ప్రచ్ఛన్నయుద్ధం తరవాతి ప్రపంచాన్ని అస్థిరపరచి, ఐరోపా మిత్రపక్షాల్ని నిరాశకు గురిచేశారు. పుతిన్ వంటివారితో స్నేహం చేశారు. వాణిజ్యపర అంశాల్లో భారత్‌తో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భవిష్యత్తు ఏమిటన్నది ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. ఆయన కొనసాగింపు అనిశ్చితికి మూలంగా మారి, ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల భావనల్ని రేకెత్తిస్తుందనే ఆందోళనలూ లేకపోలేదు.
-వీరేంద్రకుమార్