ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల మద్దతుతో ఆమోదం పొందిన తన అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో వెంటనే విచారణ జరపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. సెనేట్‌లో ఈ అభిశంసన కచ్చితంగా వీగిపోతుందన్నారు. తనపై అభియోగాలను రుజువు చేసేందుకు డెమొక్రాట్ల వద్ద ఒక్క సాక్ష్యాధారమూ లేదని ట్వీట్ చేశారు ట్రంప్. రిపబ్లికన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకతాటిపై ఉన్నారని తెలిపారు.
"అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల నుంచి ఒక్క ఓటు కూడా రాలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రిపబ్లికన్లంతా ఐక్యంగా ఉన్నారు. తీర్మానంపై ఎగువ సభలో విచారణ చేపట్టేందుకూ డెమొక్రాట్లు సిద్ధంగా లేరు. ఎందుకంటే అవినీతి నాయకుడు ఆడమ్ స్కిఫ్ ప్రమాణ స్వీకారం చేయడాన్ని వారు కోరుకోవట్లేదు, రహస్య సమాచారం చేరవేసే బిడెన్ రావడాన్ని వారు ఇష్టపడట్లేదు. "
-డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
ట్రంప్ విజయం..
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ఆమోదం పొందినప్పటికీ కెనడా, మెక్సికోలతో ఖండాంతర వాణిజ్య ఒప్పందానికి దిగువ సభలో భారీ మెజార్టీ లభించింది. బిల్లుకు అనూకూలంగా ఏకంగా 385 ఓట్లు వచ్చాయి. కేవలం 41 ఓట్లు వ్యతిరేకంగా నమోదయ్యాయి. రిపబ్లికన్లకు సెనేట్‌లో అధిక్యం ఉన్నందున అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2018లోనే కుదిరింది. అయితే ఒప్పంద ధ్రువీకరణ, మెక్సికో కార్మిక సంస్కరణలు తీసుకురావాలని డెమొక్రాట్లు డిమాండ్ చేయడం వల్ల ఆలస్యమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లుకు భారీ మెజార్టీ రావడం ట్రంప్‌నకు ఊరటనిచ్చే విషయమే.
ఇదీ చూడండి: 5,700 ఏళ్లనాటి బాలిక ఎలా ఉంటుందో చెప్పిన 'చూయింగమ్'!