అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అందించాల్సిన కొవిడ్-19 చికిత్స పూర్తయినట్లు శ్వేతసౌధం వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే వెల్లడించారు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో గడిపిన అధ్యక్షుడు సోమవారం శ్వేతసౌధం చేరుకున్నారు. అప్పటి నుంచి ట్రంప్‌నకు అక్కడే చికిత్స కొనసాగించింది వైద్య బృందం. తాజాగా కరోనా చికిత్స పూర్తయినట్లు చెప్పిన వైద్యులు.. ఆయన ప్రజల ముందుకు రావడం సురక్షితమేనని స్పష్టం చేశారు. వారం రోజులుగా ట్రంప్‌లో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
"వైద్యుల సూచన ప్రకారం ఈరోజుతో ట్రంప్ కొవిడ్ చికిత్స పూర్తి చేసుకున్నారు. శ్వేతసౌధం చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వ్యాధి లక్షణాలు కనిపించలేదు. చికిత్సకు బాగా స్పందించారు. ఇచ్చిన మందుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా లేవు. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యి శనివారం నాటికి 10 రోజులు పూర్తయ్యాయి. వైద్య బృందం నిర్వహిస్తున్న అధునాతన పరీక్షల ఆధారంగా.. అధ్యక్షుడు అదే రోజు ప్రజల ముందుకు సురక్షితంగా తిరిగి వస్తారని భావిస్తున్నాను"
-- సియాన్ కాన్లే, శ్వేతసౌధం వైద్యుడు
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం 'చాలా బాగుంది' అని వ్యాఖ్యానించారు. తనకు అందించిన ఔషధాల్లో రీజెనరాన్ యాంటీబాడీ డ్రగ్ బాగా పనిచేసిందని ట్రంప్ అన్నారు. దాని వల్లే కోలుకున్నానని వ్యాఖ్యానించారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆయన దాన్ని అభివర్ణించారు.
ఇదీ చదవండి: భాజపా జాతీయ ఉపాధ్యక్షుడి కారును ఢీకొన్న లారీ