బ్రిటన్లో మూడు రోజుల అధికారిక పర్యటన కోసం నేడు లండన్ చేరుకోనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ దంపతులకు క్వీన్ ఎలిజబెత్-2 స్వాగతం పలకనున్నారు. అనంతరం బ్రిటన్ రాణి నివాసంలో విందు స్వీకరిస్తారు ట్రంప్.
'ప్రధానిగా ఆయనే సరి'
బ్రెగ్జిట్ సంక్షోభం విషయంలో బ్రిటన్కు సలహా ఇచ్చారు ట్రంప్. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా బయటపడటమే ఉత్తమనని సూచించారు. బ్రిటన్ ప్రధాని ఈ వారంలో పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఆమె వారసుడిగా మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ మంచి ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు ట్రంప్.
'అంత పెద్ద మొత్తమా?'
మే వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ఈయూతో ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా, నిర్భయంగా తిరస్కరించాలన్నారు ట్రంప్. ఆ స్థానంలో తానుంటే అంతపెద్ద మొత్తం ఈయూకి చెల్లించనని స్పష్టం చేశారు.
4 దశాబ్దాలుగా ఈయూ సభ్యదేశంగా బ్రిటన్ ఉంది. సమాఖ్య నుంచి వైదొలిగే ముందు రుణాలకు గాను 50 బిలియన్ డాలర్లు చెల్లిస్తామని ఈయూతో బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తం చెల్లించేందుకు సొంత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని పార్లమెంటులోనూ మూడుసార్లు తిరస్కరించారు. ఫలితంగా బ్రెగ్జిట్ రెండుసార్లు వాయిదా పడింది.
ఇదీ చూడండి: అధ్యక్ష ఎన్నికపై జూన్ 18న ట్రంప్ అధికారిక ప్రకటన