వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు నష్టం కలిగించే విధంగా.. హెచ్-1బీ వీసాలకు కొత్త నిబంధనలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీటి వల్ల అమెరికన్లకు మరింత మేలు కలుగుతుందని, వారి ఉద్యోగాలను రక్షించవచ్చని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. మరి కొన్ని వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
నైపుణ్యం ఉన్న వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చేలా హెచ్-1బీ వీసా నిబంధనలు ఉంటాయని అమెరికా భద్రతా విభాగం వెల్లడించింది. వ్యవస్థలోని లోపాలను సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది.
ఈ కొత్త నిబంధనలతో వీసాకు ఆమోదం తెలిపే సమయంలో, ఆమోద ముద్ర వేసిన తర్వాత కూడా కార్యాలయాలను తనిఖీ చేయడం, వాటిని పర్యవేక్షించడం సాధ్యపడుతుంది.
భారతీయులకు నష్టం!
హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను ఉద్యోగానికి నియమించుకుంటాయి అక్కడి సంస్థలు. అయితే కొత్త నిబంధనల వల్ల భారతీయ ఐటీ నిపుణులకు నష్టం తప్పదన్నది పరిశీలకుల మాట. కరోనా సంక్షోభం వల్ల ఇప్పటికే అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఇక కొత్త నిబంధనలతో మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు.
'ఏం చెయ్యాలో ట్రంప్‌కు తెలుసు'
హెచ్ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన నూతన నిబంధనలను శ్వేతసౌధం సమర్థించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే 'ప్రత్యేక నైపుణ్యం' గల వారికి ఈ వీసా ఉపయోగపడాలని ట్రంప్ ఆశిస్తున్నట్టు స్పష్టం చేసింది.
అమెరికా ఉద్యోగాలను రక్షించి, అధిక నైపుణ్యమున్న ఉద్యోగులకు ప్రాధాన్యం దక్కే విధంగా వీసా విధానాలను ట్రంప్ మెరుగుపరుస్తున్నారని శ్వేతసౌధం వెల్లడించింది. ఇన్ని రోజుల పాటు వీసా విధానాలను దుర్వినియోగం చేశారని.. వాటిని ఇప్పుడు ట్రంప్ సరిచేస్తున్నారని పేర్కొంది.
'ఇలా ఐతే కష్టం...'
హెచ్-1బీ వీసాపై మళ్లీ ఆంక్షలను విధించడంపై పారిశ్రామిక వర్గాలు అసంతృప్తి వెలిబుచ్చాయి. వీటి వల్ల దేశంలోకి నైపుణ్యం ఉన్న వారు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని ప్రముఖ సంస్థ నాస్కామ్ పేర్కొంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేసింది.
"హెచ్-1బీ వీసాలో మార్పులు.. నైపుణ్యమున్న వారిని వెతికేందుకు ఉపయోగపడవని నాస్కామ్ విశ్వసిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి. ఉద్యోగాలు, అమెరికా ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయి. కరోనా రకవరీ దశలో ఉన్నప్పుడు, ముఖ్యంగా వ్యాపార రంగంలో నైపుణ్యమున్న వారిని ప్రోత్సహించడం ఎంతో అవసరం."
--- నాస్కామ్ ప్రకటన.
ఇదీ చూడండి:- ట్రంప్ కోసం వ్యాక్సిన్ రూల్స్‌కు వైట్‌హౌస్ బ్రేక్!