కరోనా కోరల్లో చిక్కుకుని అగ్రరాజ్యం విలవిల్లాడుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు రోజులే సమయం ఉన్న వేళ అమెరికా వైద్యులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే దేశంలో కరోనా మరణాలను ఎక్కువగా చూపారని విమర్శించారు. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమెరికాలో కరోనా మరణాలు నమోదయ్యాయని తెలిపారు. గండె జబ్బు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగులు కరోనా సోకి అనారోగ్యంతో మరణిస్తే... వారిని కూడా కొవిడ్ కారణంగా మరణించిన వారిగానే వైద్యులు చెబుతున్నారని ట్రంప్ అన్నారు. మిగతా దేశాల్లో ఈ విధానం లేదన్నారు.
" హృద్రోగాలతో ఆరోగ్యం విషమించిన వారు, క్యాన్సర్‌తో కొద్ది రోజుల్లో మరణించబోయే వారు కరోనా బారిన పడితే చనిపోతారు. అలాంటి మరణాలను కూడా కొవిడ్ మరణాలుగా చెబుతున్నారు. ఎందుకంటే కరోనా కారణంగా మరణించిన రోగుల వల్ల మన వైద్యులకు ఎక్కువ డబ్బులొస్తాయి. మన వైద్యులు చాలా తెవివైన వారు. జర్మనీ, ఇతర దేశాల్లో క్యాన్సర్, గుండెపోటు ఉన్నవారు కరోనా సోకి మరణిస్తే వారిని కొవిడ్ మృతుల జాబితాలో చేర్చరు. అనారోగ్యంతో మృతిచెందినట్లు పరిగణిస్తారు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికాలో కరోనా సోకిన రోగుల్లో కేవలం 3 శాతం మందికే అత్యవసర గదుల్లో చికిత్స అవసరమని చెప్పారు ట్రంప్. తాను నిర్విరామంగా చేసిన ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైందన్నారు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా. జాన్ హాప్కిన్స్ వివరాల ప్రకారం ఆ దేశంలో కొత్తగా 90వేల మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 90లక్షలు దాటింది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల 30వేల మంది వైరస్‌కు బలయ్యారు.
కరోనా కేసులు పెరగడానికి టెస్టుల సంఖ్యను పెంచడమే కారణమని ట్రంప్ అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కంటే అమెరికాలోనే ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో మరే ఇతర దేశం నిర్వహించనన్ని టెస్టులు అమెరికా చేసిందన్నారు.