అమెరికా పోలీసుల చేతిలో చనిపోయిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ న్యాయం జరగాలన్న డిమాండ్‌తో ఫ్లోరిడాలో నిరసనలు చేస్తున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిసింది.
కావాలనే...
ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడర్డేల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను చూసి వాహనాన్ని నిలిపాడు డ్రైవర్. ఈ నేపథ్యంలో అక్కడ నిరసన తెలుపుతున్న వారు డ్రైవర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓ నిరసనకారుడు చేసిన సంజ్ఞతో.. ఆగ్రహించిన డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ట్రక్కు పలువురికి తాకింది. అయితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు.
నేపథ్యమిదీ..
అమెరికాలోని మిన్నెపొలిస్‌లో ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సోమవారం రాత్రి ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ను అనుమానితుడిగా గుర్తించి విచారించేందుకు వెళ్లారు. సంకెళ్లు వేసి జార్జ్ మెడపై ఓ పోలీసు అధికారి మోకాలు బలంగా ఉంచాడు. ఊపిరి తీసుకోలేక జార్జి ప్రాణాలు కోల్పోయాడు. మృతికి కారణమైన పోలీసుపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనా సమయంలో అక్కడే ఉన్న నలుగురు అధికారులను బాధ్యులను చేస్తూ ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మృతుడికి న్యాయం జరగాలంటూ నిరసనలు చేస్తున్నారు అమెరికా వాసులు.
ఇదీ చూడండి: 'ఫ్లాయిడ్' ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా