త్వరలోనే చైనాతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు లేదా ఎన్నికలు పూర్తయిన వెంటనే ఒప్పందం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్నికలకు తర్వాత జరిగితే.. ఇప్పటివరకు ఇదే గొప్ప ఒప్పందం అవుతుందన్నారు.
" త్వరలోనే చైనాతో ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అది ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ ఉండొచ్చు. నేను ఎన్నికల్లో గెలువబోతున్నానని చైనా భావిస్తోంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుస్తానని చైనా ఆందోళన చెందుతోందన్నారు ట్రంప్. ఒక వేళ ఎన్నికల్లో తాను తిరిగి గెలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దుర్భలంగా మారుతాయని ఇప్పటికే హెచ్చరించినట్లు ఉద్ఘాటించారు. వారు మరొకరు గెలవడాన్ని చూడాలనుకుంటున్నారని ట్రంప్ తెలిపారు. జో, ఎలిజబెత్ పోకాహెంటాస్ వారెన్లు విజయం సాధించేందుకు చైనా ఇష్టపడుతుందని ఎద్దేవా చేశారు.
2020 వరకు వాణిజ్య లోటును 200 బిలియన్ డాలర్లకు చైనా తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మరోమారు హెచ్చరించారు ట్రంప్. గతేడాది 636 బిలియన్ డాలర్ల మొత్తం వాణిజ్యంలో సుమారు 375 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని అమెరికా పేర్కొంది.
2018లో మొదలు..
పరస్పరం దిగుమతి సుంకాలు పెంచటం వల్ల 2018లో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 250 బిలియన్ డాలర్లు విలువ చేసే చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు పెంచారు. దానికి ప్రతీకారంగా 110 బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులపై సుంకాలు విధించింది చైనా.
ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు 2018 నవంబర్ నుంచి చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లభించలేదు.