అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంపై అక్కడి కోర్టులో దావా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా యాప్‌పై నిషేధం విధించారని ఫిర్యాదులో పేర్కొంది. నిషేధం ఎత్తివేసేలా ట్రంప్ పాలకవర్గాన్ని ఆదేశించాలని ఫెడరల్ న్యాయమూర్తిని కోరింది. ట్రంప్‌పై టిక్‌టాక్.. కోర్టుకు వెళ్లడమది రెండోసారి. తాజా చర్యతో అమెరికా, చైనా మధ్య నెలకొన్న సాంకేతిక పోరు మరింత తీవ్ర రూపం దాల్చినట్లైంది.
ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పరిధులు దాటి వ్యహరించారని టిక్‌టాక్ ఆరోపించింది. ట్రంప్ నిర్ణయం వాక్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకంగా ఉందని తెలిపింది. తమని తాము వ్యక్తపరుచుకునేందుకు ఏకతాటిపైకి వచ్చిన లక్షలాది మందితో కూడిన ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించింది. భద్రత, గోప్యత విషయంలో పౌరుల ప్రయోజనాలను కాపాడుతున్నామన్న ఆధారాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది.
ఆదివారంతో పూర్తిగా నిలిపివేత
చైనాపై గుర్రుగా ఉన్న ట్రంప్.. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌లపై నిషేధం విధించారు. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని అమెరికా వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్ రోస్ ఆరోపించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొనే యాప్‌లను నిషేధించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాలోనూ బ్యాన్