కొవిడ్-19 రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స చేసే క్రమంలో వైద్య సిబ్బంది వైరస్ సంక్రమణ ముప్పును ఎదుర్కొంటున్నారు. శ్వాస పరికరాలు అమర్చే, తిరిగి వాటిని బయటకు తీసే సమయంలో రోగి తుంపర్ల ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఈ భయం తొలగించేలా అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీ, జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా గాజుపెట్టె లాంటి రక్షణ పరికరాన్ని రూపొందించాయి.
పాలీకార్బొనేట్‌తో తయారైన ఈ పెట్టెను రోగి తలపై సులువుగా అమర్చవచ్చు. దీని వెనుక బిగించిన గ్లౌజుల్లో వైద్యులు చేతులు ఉంచి శ్వాస పరికరాలను రోగికి సురక్షితంగా బిగించవచ్చు. రోగి తాలూకు తుంపర్లు వైద్యసిబ్బందిని తాకే అవకాశం ఏమాత్రం ఉండదు. వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) ధరించినప్పటికీ ఈ పరికరం మరొక రక్షణ వలయంలా ఉంటుందని రూపకర్తలు చెప్పారు. అతిసూక్ష్మ కణాలు సైతం పెట్టె నుంచి బయటికి రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో రెండు రకాల నమూనాలు రూపొందించారు. ఒకటి మడత పెట్టే రకం కాగా మరొకటి సీ ఆకారంలో ఉంటుంది.
ఇదీ చూడండి: జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా ఉండొచ్చు!