CM Revanth Reddy Public Meeting : మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
త్వరలోనే మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.
దేశానికి ప్రధానిని ఇచ్చిన గడ్డ కరీంనగర్ : దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అనీ.. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావునని సీఎం రేవంత్ కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కరీంనగర్ బిడ్డ జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంత దూరమైనా వెళుతుందని స్పష్టం చేశారు. ఎంపీగా పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే తెలంగాణను తీసుకువచ్చారన్నారు. అదే బండి సంజయ్‌ను గెలిపిస్తే కేంద్రం నుంచి కరీంనగర్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు కూడా కరీంనగర్‌కు ఏం చేయలేదని విమర్శించారు.
అధికారం పోయే సరికి బీఆర్ఎస్ నేతల మైండ్ పోయింది : 'మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పుడు నన్ను కలవడానికి వచ్చినా చేతినిండా దస్త్రాలు తీసుకువస్తారు. ఈ ప్రాంతంలోని నేతన్నలు, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడమే మా ప్రాధాన్యం. కరీంనగర్‌లో గల్ఫ్ బోర్డు పెట్టాలని ఆది శ్రీనివాస్ అడిగారు. గల్ఫ్‌లో తెలంగాణ వాసులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పూర్తి చేస్తున్నాం. కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుంటారు. కేటీఆర్, హరీశ్‌రావు మన కాళ్ల మధ్యలో కట్టేలు పెడుతున్నారు. అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు మైండ్ పోయింది.' అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
పనులు చేస్తుంటే మీకు ఎందుకు నొప్పి : బీఆర్ఎస్ సరిగా పాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.. అది కేసీఆర్ వల్ల కాదా అంటూ మరోసారి ప్రశ్నించారు. రూ.11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్ ఐదేళ్లు తీసుకున్నారు. కానీ తమ ప్రభుత్వం 25 రోజుల్లోనే 23 లక్షల కుటుంబాలుకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు. పదేళ్లలో మీరు చేయలేని పని మేము చేస్తుంటే మీకు నొప్పి ఎందుకని అడిగారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉంది.. త్వరలోనే పెడతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తామన్నారు.
మీరు చేసిన రుణమాఫీ.. మేము చేసిన రుణమాఫీ వివరాలు బయటకు తీసి చర్చకు పెడదామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఉద్యోగాలు వచ్చిన వారిని పిలుస్తాం.. లెక్కపెట్టుకోనని సవాల్ విసిరారు. కొత్తగా ఉద్యోగాలు వచ్చినవారు.. 50 వేల మంది కంటే తక్కువ ఉంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"కేసీఆర్ అసెంబ్లీకి రావాలి? కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు చర్చిద్దాం. 80 వేల పుస్తకాలు ఏం చదివావో మాట్లాడదాం. ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి రెండు చీరలు ఇస్తాం. పరిశ్రమలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భూసేకరణ చేస్తున్నాం. భూసేకరణకు అధికారులు వస్తే దాడి చేస్తారా? భూసేకరణ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదా? పరిశ్రమలు తెచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకూడదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భూములు సేకరించలేదా. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. అభివృద్ధి కోసం ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. భూమి కోల్పోతున్నవారికి మూడు రెట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి : సీఎం రేవంత్