'అవాక్కయ్యారా? ఇది ఎక్కువ మురికిని తొలగించి.. గొప్ప తెల్లదనాన్ని ఇస్తుంది' అంటూ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) సంస్థ ఉత్పత్తి చేసిన డిటర్జెంట్ బ్రాండ్ 'టైడ్' ప్రకటనను మీరు టీవీలో చూసే ఉంటారు కదా..! ఇప్పుడు టైడ్ డిటర్జెంట్‌తో భూమి మీదున్న ప్రజల దుస్తులకే కాదు.. అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ధరించే ప్రత్యేక దుస్తులకు పట్టిన మురికిని కూడా వదిలిస్తామంటోంది పీ అండ్ జీ సంస్థ.
సాధారణంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు వారు ధరించే దుస్తులను ఉతకరు. బాగా మురికిగా మారే వరకు వాటినే ధరిస్తారు. ఆ తర్వాత కొత్తవి వేసుకొని విడిచిన దుస్తులను ఒక కవర్‌లో వేస్తారు. దీంతో వ్యోమగాముల కోసం ఎక్కువ సంఖ్యలో దుస్తులు.. టన్నుల కొద్దీ వస్త్రం వృథా అవుతుంది. ఈ సమస్యకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పరిష్కారాన్ని అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో పీ అండ్ జీ సంస్థతో నాసా చేతులు కలిపింది. అంతరిక్షంలో వ్యోమగాముల మురికి దుస్తులను ఎలా శుభ్రపరచాలనే విషయంపై పరిశోధన చేయనుంది. ఈ క్రమంలో ఒక టైడ్ డిటర్జెంట్.. ఒక స్టెయిన్ రిమూవల్‌ను ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా అంతరిక్షానికి పంపించనున్నట్లు పీ అండ్ జీ వెల్లడించింది. అంతరిక్షంలో.. గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్‌లో ఉండే పదార్థాలు ఏ విధంగా పనిచేస్తాయో శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. ఆ తర్వాత స్టెయిన్ రిమూవల్ పెన్నులను కూడా పంపిస్తుందట.
వ్యోమగాముల దుస్తుల కోసం నాసా గతంలోనూ ఎన్నో ప్రయోగాలు చేసింది. వ్యోమగాములకు చెమట పట్టకుండా.. బ్యాక్టీరియా సోకకుండా యాంటిబ్యాక్టీరియల్ దుస్తులను తయారు చేసింది. కానీ ఇది శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. మరోవైపు చంద్రుడు, అంగారకుడిపైకి మానవసహిత రాకెట్లను ప్రయోగించే యోచనలో ఉన్న నాసాకు ఇదో సమస్యగా మారింది. ఈ ప్రయోగాల్లో వ్యోమగాములు సుదీర్ఘకాలం రాకెట్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ధరించేందుకు భారీ సంఖ్యలో దుస్తులను తీసుకెళ్లడం కష్టతరమైన పని. అందుకే పీ అండ్ జీతో కలిసి నాసా 'టైడ్' ప్రయోగానికి సిద్ధమైంది.
ఇవీ చదవండి: