కరోనా వైరస్ సోకిన వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు కొంతకాలం పాటు రక్షణ కల్పిస్తాయని ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది. అయితే, ఒకసారి కోలుకున్న తర్వాత వచ్చే యాంటీబాడీలు రీ-ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా రక్షించలేవని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా యువకుల్లో రీ-ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా ఈ యాంటీబాడీలు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేవని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో ఉండే యాంటీబాడీలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఇకాహన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, నావల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కలిసి 3వేల మంది యువకులపై పరిశోధన జరిపాయి. పరిశోధనలో పాల్గొన్న వారిలో ఇదివరకు కరోనా వైరస్ సోకని (సిరోనెగటివ్) 2247 మందిలో 50శాతం (1079) మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. వీరితో పోలిస్తే గతంలో పాజిటివ్ వచ్చిన (సిరోపాజిటివ్) 189 మందిలో 10శాతం(19 మంది) రీ-ఇన్‌ఫెక్షన్ బారినపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో వైరస్ సోకిన వారితో పోలిస్తే వైరస్ సోకని వారికి ఐదురెట్లు ఎక్కువ ముప్పు పొంచి ఉందని తేల్చారు. అంతేకాకుండా వైరస్ నుంచి కోలుకున్న యువకులూ రీ-ఇన్‌ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉన్నట్లు కనుగొన్నారు.
పరిశోధనలో భాగంగా మెరైన్ విభాగానికి ఎన్నికైన 3249 మంది యువకులను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాథమిక శిక్షణకు వచ్చిన సమయంలోనే వీరందరికీ ఆర్‌టీపీసీఆర్ ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. అనంతరం పాజిటివ్ వచ్చిన వారిని(సిరోపాజిటివ్), రానివారికి ప్రత్యేకంగా ప్రతివారం పలుదఫాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2346 మందిపై మే-2020 నుంచి నవంబర్- 2020 మధ్య కాలంలో పలు దఫాల్లో కొవిడ్ పరీక్షలను కొనసాగించారు. వీరిలో తొలుత వైరస్ సోకిన వారిలో 189 మంది తిరిగి వైరస్ బారినపడగా, మిగతా 2247 మందిలో 1098 మందికి తొలిసారి వైరస్‌కు గురయ్యారు.
ఇదీ చూడండి: పట్టాలు తప్పిన రైలు- 32 మంది మృతి