కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఒక కొత్త టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ రకాలు, గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్‌లపైనా ఇది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కోతులు, ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వివరించారు. మానవుల్లోనూ ఇదే ఫలితం రావొచ్చని పేర్కొన్నారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బార్టన్ ఎఫ్ హేన్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇతర వైరస్‌ల తరహాలోనే కరోనా వైరస్ కూడా ఉత్పరివర్తనలకు లోనవుతుందన్న అంచనాతో తాము పరిశోధన కార్యక్రమాన్ని మొదలుపెట్టామని హేన్స్ చెప్పారు. మునుపటి సార్స్ మహమ్మారిపై జరిగిన పరిశోధనల ఆధారంగా ముందడుగు వేశామన్నారు.
కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్.. మానవ కణాల్లో గ్రాహకాలకు అనుసంధానం కావడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఈ ప్రొటీన్‌పై ఉండే ‘రెసెప్టార్ బైండింగ్ డొమైన్’పై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. మానవుల్లోకి ప్రవేశించడానికి ఈ భాగం వైరస్‌కు సాయపడుతుంది. అదే సమయంలో యాంటీబాడీలకు సహకరించి, సదరు వైరస్‌ను నిర్వీర్యం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ 'రెసెప్టార్ బైండింగ్ డొమైన్'లోని ఒక నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకొని యాంటీబాడీలు సులువుగా వైరస్‌పై దాడి చేయగలుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అచ్చంగా ఆ భాగాన్ని అనుకరించే ఒక నానోరేణువును డిజైన్ చేశారు. శరీర రోగ నిరోధక స్పందనను మరింత పెంచేందుకు పటికతో తయారైన ఒక పదార్థాన్ని ఈ రేణువుకు జోడించారు. దీన్ని కోతుల్లోకి ఎక్కించినప్పుడు కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను ఇది వంద శాతం నిలువరించినట్లు గుర్తించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు, వైరస్ ఇన్‌ఫెక్షన్ ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీల కన్నా ఎక్కువగా ఇది ఉత్పత్తి చేసిందని తేల్చారు. రెసెప్టార్ బైండింగ్ డొమైన్‌లోని సదరు భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కరోనాలోని కొత్త రకాలు, గబ్బిలాల్లోని సార్స్ సంబంధ వైరస్‌లనూ యాంటీబాడీలతో నిర్వీర్యం చేయవచ్చని గుర్తించారు.
ఇదీ చదవండి: 'బహుళ వ్యూహాలతోనే కరోనాకు చెక్!'