అమెరికాలో నూతనంగా కొలువుదీరిన జో బైడెన్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎదురుచూస్తున్నారని ఆయన ప్రతినిధి స్టెఫాన్ జరిక్ పేర్కొన్నారు. అగ్రరాజ్యంతో ఐరాస సానుకూల సంబంధాలను నెలకొల్పుతుందని తెలిపారు. భద్రతా మండలి సహా అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాయకత్వ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన సమయం చూసుకొని అధ్యక్షుడు బైడెన్‌తో గుటెరస్ మాట్లాడతారని తెలిపారు.
"బైడెన్‌తో పనిచేసేందుకు గుటెరస్ ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి బైడెన్, కమలా హారిస్‌కు త్వరలో లేఖ పంపిస్తారు. శాంతి, భద్రతలతో పాటు సుస్థిర అభివృద్ధి, మానవ హక్కులను పరిరక్షించడానికి అమెరికాతో కలిసి పనిచేస్తాం."
-స్టెఫాన్ జరిక్, ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి
బైడెన్ యంత్రాంగం సంతకం చేయనున్న పలు కార్యనిర్వహక ఉత్తర్వులను ఐరాస పరిశీలించిందని తెలిపారు జరిక్. వాతావరణం, గ్లోబల్ హెల్త్, డబ్ల్యూహెచ్ఓ, కరోనా వంటి విషయాల్లో అమెరికా సర్కార్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఐరాస, అమెరికా మధ్య చురుకైన భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు.
వలసదారుల సమస్యల పరిష్కారానికి అమెరికా బలమైన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు జరిక్. గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ ఒప్పందంలో అమెరికా చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరాస, అమెరికా మధ్య భాగస్వామ్యం ఇదివరకు ఎన్నడు లేని స్థాయిలో అవసరమని అన్నారు.
ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్ఓలోకి అమెరికా పునరాగమనంపై ఐరాస హర్షం