కరోనా దెబ్బకు అమెరికాలో పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ఆ దేశంలో వైరస్ బారిన పడి మరణించినవారి సంఖ్య బుధవారం ఉదయానికి 4వేలు దాటింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన 3వ దేశంగా నిలిచింది అగ్రరాజ్యం.
నాలుగు రోజుల్లోనే రెట్టింపు..
అమెరికాలో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య గత శనివారం 2,010 ఉండగా.. బుధవారం ఉదయానికి ఆ సంఖ్య 4,076కు చేరినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. దాదాపు నాలుగురోజుల్లోనే మరణాలు సంఖ్య రెట్టింపవడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఈ దేశంలో దాదాపు 1,88,578 మంది వైరస్ బారినపడ్డారు.
వేల మందితో యుద్ధం...
న్యూయార్క్‌లో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 40 శాతం ఈ ప్రాంతం నుంచే వచ్చాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 250 మందికిపైగా మృత్యువాతపడ్డారు. బాధితులకు చికిత్స అందించేందుకు తమ రాష్ట్రంలో అదనంగా 10 లక్షల మంది వైద్య సిబ్బంది అవసరమని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో పేర్కొన్నారు. 80 వేల మంది విశ్రాంత వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవలందించేందుకు ముందుకొచ్చారు.
కరోనా నివారణకు వర్జీనియా, వాషింగ్టన్, కాలిఫోర్నియా సహా అమెరికావ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో జన సంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. దేశంలో ఇప్పటివరకు 10 లక్షలమందికి పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఎన్-95 మాస్కులను సూక్ష్మజీవిరహితంగా మార్చగల సరికొత్త యంత్రానికి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి...