అఫ్గానిస్థాన్ సైనికులు, పోలీసులపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. తాలిబన్లు జరిపిన దాడిలో 20 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పడంపై తాలిబన్ నాయకుడు ముల్లాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన కొద్ది గంటలకే ఈ దాడికి ఒడిగట్టారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం సైతం తాలిబన్ల దాడికి దీటుగా సమాధానమిచ్చింది. వారి స్థావరాలపై వైమానిక దాడి చేసింది. అమెరికా సైన్యం అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే ఈ దాడులకు దిగారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో తర్వాత జరిగే చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒప్పందంలో భాగంగా అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ఖైదీల అప్పగింతలో తలెత్తిన అభిప్రాయభేదాలే దాడులకు కారణంగా తెలుస్తోంది.
"నహ్రా-ఏ-సరాజ్, హెల్మండ్‌లోని తాలిబన్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇది ఆత్మరక్షణ కోసం చేసిన దాడి మాత్రమే."
-సన్నీ లెగెట్, అమెరికా అఫ్గానిస్థాన్ సైనిక వ్యవహారాల బాధ్యుడు
అమెరికా-తాలిబన్ల మధ్య ఇటీవల పాక్షిక ఒప్పందం కుదిరింది. పూర్తిస్థాయి ఒప్పందాలపై సంతకాలు చేసే దిశగా ఇరువర్గాలు సాగుతున్నాయి. మార్చి 10 నుంచి అఫ్గాన్- తాలిబన్ల మధ్య పూర్తిస్థాయి ఒప్పందం కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. గత 11 రోజులుగా అఫ్గాన్‌లో ఎలాంటి దాడులు చోటుచేసుకోలేదు. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటున్న అఫ్గాన్‌లో ఈ దాడులు మరోసారి ఉద్రిక్తతలను పెంచాయి.
ఇదీ చూడండి: తాలిబన్ నాయకుడితో ట్రంప్ సంభాషణ