అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యుడ్ని చేస్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సెనెట్‌లో అభిశంసన విచారణ జరగనున్న వేళ.. ట్రంప్ మద్దతుదారుల వ్యాఖ్యలు ఆయనకు మరింత చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ట్రంప్ ఆదేశాల మేరకే జనవరి 6న క్యాపిటల్ భవనం వైపు దూసుకెళ్లినట్లు దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ట్రంప్ మద్దతుదారులు చెప్పారు.
తనను తాను ట్రంప్ మద్దతుదారుగా చెప్పుకొన్న జెన్నా ర్యాన్ అనే ఓ వ్యక్తి.. ట్రంప్ పిలుపు మేరకే క్యాపిటల్ భవనం వద్దకు వెళ్లినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భవనంపై దాడికి పాల్పడిన మరో వ్యక్తి సైతం తనను ఈ దాడికి ప్రేరేపించింది ట్రంపేనని చెప్పాడు. ఇప్పటివరకూ 130 మందికి పైగా ట్రంప్ మద్దతుదారులు ఎఫ్‌బీఐ నుంచి దాడి ఆరోపణలు ఎదుర్కొంటుండగా అందులో అధికశాతం మంది ట్రంప్‌నే బాధ్యునిగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు.. ట్రంప్ అభిశంసన విచారణలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెనెట్‌లో ఫిబ్రవరి 8వ తేదిన ట్రంప్‌పై అభిశంసన విచారణ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 8 నుంచి ట్రంప్ అభిశంసనపై విచారణ