అమెరికాలోని ఉటా నగరంలో ఎరుపురంగు కొండల (రెడ్రాక్స్) మధ్య బయటపడిన ఓ ఏకశిలా స్తంభం.. ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది. జనావాసాల్లేని ఆ చోటులో స్తంభాన్ని ఎవరు పాతారోనని అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.
ఎలా బయటపడింది..
బిగ్హార్న్ షీప్ అనే సంస్థ.. హెలికాప్టర్లో సర్వే నిర్వహిస్తుండగా ఈ స్తంభం విషయం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిశీలించడానికి ఉటాకు చెందిన ప్రజా సంక్షేమ శాఖ, అటవీ వనరుల అధికారులు ప్రయత్నించారు. నవంబర్ 18న ఆ వింత వస్తువు సమీపానికి చేరుకున్నారు. ఇద్దరు మనుషుల ఎత్తులో ఆ స్తంభం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ, నిర్మానుష్య ప్రదేశమైన ఆ రెడ్రాక్స్ మధ్యకు దాన్ని ఎవరు తీసుకువచ్చారన్న దానిపై ఆధారాలను కనిపెట్టలేకపోయారు.
ప్రజలు ఆందోళన చెందుతారన్న ఉద్దేశంతో అధికారులు స్తంభం.. కచ్చితమైన చిరునామాను బహిర్గతం చేయలేదు. కానీ, అనుమతి లేకుండా ఈ కళాకృతిని రెడ్రాక్స్ మధ్యలో ఉంచడం అక్రమ చర్యగా అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై భూ నిర్వహణ అధికారులు దర్యాప్తు జరపనున్నారని తెలిపారు.
ఇదీ చూడండి:మరో 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ఎక్స్