అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై కాంగ్రెస్ కమిటీ తొలిరోజు విచారణ సందర్భంగా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పమేలా కర్లన్ క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ జ్యుడీషియరీ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చే సందర్భంగా అధ్యక్షుడి కుమారుడు బారన్ ట్రంప్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కర్లన్.
ఇదీ జరిగింది
ట్రంప్ అభిశంసనపై బహిరంగ విచారణ సందర్భంగా కాంగ్రెస్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరయ్యారు పమేలా. కాంగ్రెస్ సభ్యురాలు షీలా జాక్సన్ లీ అడిగిన ప్రశ్నకు ట్రంప్ కుమారుడు బారన్ రాజు కాలేకపోతున్నందువల్లే ఆ అర్థం వచ్చేలా పేరుపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"రాజుకు, అధ్యక్షుడికి మధ్య భేదాన్ని మీకు ఒక్క ఉదాహరణలో చెబుతాను. ఎలాంటి గౌరవప్రదమైన బిరుదులు పేర్లకు ముందు ధరించకూడదని రాజ్యాంగం చెప్పింది. ఈ నిబంధన కారణంగానే అధ్యక్షుడు ఆయన కుమారుడికి రాజు అనే అర్థం వచ్చేలా బారన్ అని పేరు పెట్టారు. కానీ అతడిని రాజును చేయలేరు."
-అభిశంసనపై వాంగ్మూలం సందర్భంగా కర్లన్
కర్లన్ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల్లోకి తన 13ఏళ్ల కుమారుడిని లాగడమేంటని మండిపడ్డారు. మరికొందరు ఇదే అంశంపై కర్లన్ను తప్పుబట్టారు. చివరకు బారన్ పేరు ప్రస్తావించడంపై ఆమె క్షమాపణ చెప్పారు.
'అధ్యక్షుడికి శుభదినం'
అభిశంసనపై కాంగ్రెస్ జ్యుడీషియరీ కమిటి తొలిరోజు విచారణ ట్రంప్‌కు శుభదినమని ప్రకటించింది అధ్యక్ష కార్యాలయం. డెమొక్రాట్లకు ఇది దుర్దినమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో తొలిరోజు విచారణ సందర్భంగా ఉక్రెయిన్ దేశాధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ అభిశంసనకు అర్హమైనదని ముగ్గురు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: అమెరికా కాల్పుల ఘటనలో భారత వాయుసేన సారథి సురక్షితం