మంచు తుపాను కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాలో వాహన రాకపోకలు స్తంభించాయి. లాస్ఏంజెలస్, సాన్ జాక్విన్ లోయ మధ్య ఉన్న టెంజాన్ పాస్ వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో కాలిఫోర్నియా పోలీసులు ఆ మార్గంలో అంతరాష్ట్ర రవాణాను సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే పరిస్థితి రాష్ట్ర రహదారి 58 వద్ద నెలకొంది. తూర్పు కెర్న్ కౌంటీలోని తెహఛాపీ పాస్ వద్ద మంచు తీవ్రత ఎక్కువ ఉండటమే కారణం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎస్ఆర్178 మార్గం అందుబాటులో ఉన్నా వాహనాలకు గొలుసులు ఉన్న ప్రత్యేక టైర్లను ఉపయోగించాల్సి వస్తోంది.
వారం క్రితం ప్రారంభమైన మంచు తుపాను కాలిఫోర్నియా సహా ఇతర రాష్ట్రాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంగళవారం నుంచి ఈ తుపాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గురువారం వరకు ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. శాన్ఫ్రాన్సిస్కో బేలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించింది. ప్రభుత్వం అందుకు తగిన చర్యలు చేపడుతోంది.
కొలరాడోలో ప్రమాదాలు..
కొలరాడోలోని అంతర్రాష్ట్ర రహదారి 25పై మంచు తుపాను కారణంగా మంగళవారం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. లవ్ల్యాండ్ ప్రాంతంలో సుమారు 17 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారని తెలిపారు.
ఇదీ చదవండి : సెనేట్ ముందుకు ట్రంప్ అభిశంసన