ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది. ఉదయం ఉద్యోగానికి వెళ్లాలనే తొందరలో తినకుండా వెళ్లి.. రాత్రిళ్లు అల్పాహారంతో సరిపెట్టుకుంటారు. మరి అలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం?
ఆహారం తీసుకొనే సమయం కూడా బరువు నియంత్రణపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన 'వండర్బిల్ట్ 'విశ్వవిద్యాలయం, మరి కొంత మంది శాస్త్రవేత్తలు కలిసి ఆహారపు అలవాట్లు, శరీర బరువు నియంత్రణపై అధ్యయనం చేశారు.
సుమారు 56 గంటల పాటు మధ్య వయస్కులు, వయసు మళ్లిన వారిపై వేర్వేరుగా పరిశోధనలు నిర్వహించారు. ఆ సమయంలో వారి జీవ క్రియను పరిశీలించారు. బరువు పెరగడం లేదా తగ్గడం.. తీసుకొనే ఆహార పరిమాణం, చేసే వ్యాయామంపై ఆధారపడి ఉంటుందని తేల్చారు.
అంతేకాకుండా జీవ గడియారం, నిద్ర వేళలూ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని వివరించారు.